TTD Chairman: టీటీడీ ఛైర్మన్ గా ఏమి చేయాలో.. ఎలా చేయాలో.. భక్తులకు ఏది చేస్తే మంచి జరుగుతుందో నాకు అవగాహన ఉంది. ఇప్పుడు నేను చేసింది చాలా తక్కువ. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా మార్క్ కచ్చితంగా చూపిస్తాను.. భక్తులకు శ్రీవారి దర్శనం ఆహ్లాదకరంగా సాగేలా చేస్తాను అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తనదైన శైలిలో చెప్పారు. టీటీడీ ఛైర్మన్ గా నియమితులైన సందర్భంగా మీడియా తరఫున మహాన్యూస్ గ్రూప్ ఛైర్మన్ & ఎండీ మారెళ్ల వంశీకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ తనకు టీటీడీ ఛైర్మన్ పదవి మీడియా ప్రతినిధిగా ఉన్నందుకు రాలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి 45 సంవత్సరాలుగా నిస్వార్ధంగా.. ఏ పదవీ ఆశించకుండా చేసిన సర్వీస్ కు ఇది దక్కిందని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీకి సామాన్య కార్యకర్తలా పనిచేశానన్నారు . పదిహేనేళ్ళు పసుపు చొక్కా తప్పమరొటి వేసుకోలేదని తెలిపారు. గత సంవత్సరంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని కోరాననీ, దానికి ఆయన ప్రభుత్వం ఎరపడిన తరువాత తప్పనిసరిగా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు పదవి ఇచ్చారన్నారు. తిరుపతి వెంకటేశునితో తనకు ఎంతో అనుబంధం ఉందనీ.. చిన్నతనం నుంచి ఎన్నోసార్లు తిరుమలలో శ్రీవారిని దర్షించుకోవడానికి వచ్చానని చెప్పారు. సామాన్య భక్తులకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఆ అవగాహనతోనే ఛైర్మన్ పదవి తనకు రావడానికి ఆరునెలల ముందు నుంచీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని.. తప్పనిసరిగా అన్నిరకాలుగాను తిరుమల ప్రతిష్ట మరింత పెరిగేలా చూస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక మహాన్యూస్ గ్రూప్ ఛైర్మన్ & ఎండీ వంశీకృష్ణ కుటుంబ సమేతంగా తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన బీఆర్ నాయుడు జర్నలిస్టుల కోసం తప్పనిసరిగా దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
TTD Chairman: అంతకు ముందు మహాన్యూస్ గ్రూప్ ఛైర్మన్&ఎండీ వంశీకృష్ణ అతిధులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య రైతుకుటుంబంలో పుట్టి.. టీటీడీ ఛైర్మన్ వరకూ ఎదిగిన బీఆర్ నాయుడుని మీడియా తరఫున సత్కరించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 25 వేలమంది జర్నలిస్టులు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకునేందుకు ఇబ్బందులు లేని అవకాశాన్ని కల్పించాలని టీటీడీ ఛైర్మన్ ను కోరారు. మీడియా అంతా కలిసి కట్టుగా ఉండాలనీ.. కలిసి ఉంటేనే అందరికీ మంచి జరుగుతుందనీ ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తన ఆకాంక్షను తెలియచెప్పారు.
TTD Chairman: అనంతరం టీటీడీ బోర్డు మెంబర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ నాయుడు ఛైర్మన్ గా ఉన్న సమయంలో తనకు బోర్డు మెంబర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించడం తన పూర్వజన్మ సుకృతం అని చెప్పారు. తిరుమలలో గతంలో జరిగిన అవకతవకలను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా తామంతా కృషి చేస్తామని చెప్పారు.
TTD Chairman: సినీనటుడు మురళీమోహన్ మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడును అభినందించారు. తిరుమలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయ్యేలా చూడాలని కోరారు. బీఆర్ నాయుడు తనకున్న అపార అనుభవంతో టీటీడీకి పూర్వవైభవం తీసుకువస్తారని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.
కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ పాత్రికేయులు రామచంద్ర మూర్తి, బండారు శ్రీనివాస్, తెలకపల్లి రవి, కట్టా శేఖర్ రెడ్డి, సీపీఆర్వో అయోధ్య రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షడు విరహత్ అలీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షడు వేణుగోపాల్, టీటీడీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ క్లబ్ నాయకులు పద్మ అలాగే వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.