YCP Fake on Amaravati: అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం, కోట్లాది మంది కల! రైతుల త్యాగాలు, ప్రజల ఆశలతో నిర్మితమవుతున్న ఈ కలను చెరిచేలా పదేళ్లుగా కొందరి కుట్రలు వెంటాడుతూనే ఉన్నాయి. తప్పుడు ఫిర్యాదులతో ప్రపంచ బ్యాంకు రుణాలను అడ్డుకుని, కులాలను రెచ్చగొట్టి, అమరావతిని “స్మశానం” అంటూ అవమానించారు. రాష్ట్ర ఆకాంక్షలను నీచ రాజకీయాలతో అణచివేసే ఈ రాక్షసత్వం ఏంటో అర్థం కాదు. అయినా నిజమే గెలిచింది. వైసీపీ చేసిన కుట్ర పూరిత ఫిర్యాదులను చెత్తబుట్టలో పడేసిన ప్రపంచ బ్యాంకు అమరావతికి జైకొట్టింది.
అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రుల హృదయంలో ఓ ఆంకాక్ష పుట్టుకొచ్చింది. అదే అమరావతి రాజధాని. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ఊపిరిలా నిలిచే ఈ కల, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. రైతులు తమ భూములను స్వచ్ఛందంగా అర్పించారు. కూలీలు కళ్లనిండా ఆశలు నింపుకున్నారు. ప్రపంచస్థాయి నగరం వారి ఊహల్లో మెదిలింది. కానీ ఈ కలను చీకటి కమ్మేసింది…. వైసీపీ కుట్రల రూపంలో.
2017లో మొదలైంది ఈ దుష్ప్రచారం. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి రూ.3,500 కోట్ల రుణం కోసం సీఆర్డీఏ ప్రయత్నిస్తుండగా, వైసీపీ తప్పుడు ఫిర్యాదులతో అడ్డుకుంది. “అమరావతి మునిగిపోతుంది, సస్టైనబుల్ కాదు, పర్యావరణం దెబ్బతింటుంది” అంటూ అపోహలు సృష్టించింది. భూములు బలవంతంగా తీసుకున్నారని, రైతులు, కూలీల జీవనోపాధి నాశనమైందని అసత్యాలు ప్రచారం చేసింది. ల్యాండ్ పూలింగ్‌ను దోపిడీగా చిత్రీకరించి, “కమ్మ రాజధాని, ధనవంతుల రాజధాని” అంటూ కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టింది. అమరావతిని “భ్రమరావతి, స్మశానం” అంటూ అవమానించి, రియల్ ఎస్టేట్ మాఫియాగా ముద్రవేసింది. ఆ తర్వాత తాము అధికారంలోకి రాగానే… కుట్రపూరితంగా మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి, అమరావతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy Japan Tour: పెట్టుబడులే లక్ష్యంగా జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి
ఇక గత ఏడాది డిసెంబర్‌లోనూ వైసీపీ తన రాక్షసత్వాన్ని మళ్లీ భయటపెట్టుకుంది. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు తప్పుడు ఫిర్యాదులు పంపింది. దేశ, విదేశాల్లోని సంస్థలు, వ్యక్తుల పేరిట మెయిల్స్‌తో అమరావతిలో అనర్థం జరుగుతోందని ఆరోపించింది. రూ.15,000 కోట్ల రుణాన్ని అడ్డుకునేందుకు… విజయవాడలో ప్రపంచ బ్యాంకు బృందం బస చేసిన హోటల్‌కి వెళ్లి… అనేక రకాలుగా వారిని ప్రభావితం చేసేందుకు విఫలయత్నాలు చేసింది. కానీ సత్యం గెలిచింది. ప్రపంచ బ్యాంకు వైసీపీ ఫిర్యాదులను బూటకమని తేల్చి, అమరావతికి 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరుకు ఓకే చెప్పింది. ఏడీబీ కూడా 788 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇందులో కేంద్రం వాటాతో కలిపి రూ.4,285 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.
అమరావతి రైతుల కన్నీళ్లు, కలలు, త్యాగాల స్ఫూర్తితో నిలిచిన పవిత్ర భూమి. వైసీపీ మాత్రం ఈ భూమిని రాజకీయ రంగ స్థలంగా మార్చింది. కులాలను రెచ్చగొట్టి, అసత్యాలతో అడ్డుకుని, రాష్ట్ర ప్రజల ఆశలను నీచ రాజకీయాలతో అణచివేసే ప్రయత్నం జరిగింది. ఈ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది… ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేంద్రం సహకారంతో మహా అమరావతిగా రూపుదిద్దుకోబోతోంది. మే 2న అమరావతికి రానున్న ప్రధాని మోడీ.. రాజధాని పునర్‌నిర్మాణానికి సంకల్పం చేయనున్నారు. ఇక వైసీపీ కుట్రల్ని చీల్చుకుంటూ శరవేగంగా రాజధాని అభివృద్ధి దూసుకెళ్లనుందని పరిశీలకులు భావిస్తున్నారు.