KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో పాల్గొన్న ఆయన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 అందిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు ఇప్పటివరకు కేవలం మాటలకే పరిమితమయ్యాయని కేటీఆర్ అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ఒక్క గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో హామీలను నెరవేర్చినట్టుగా చూపుతున్నారని ఆయన అన్నారు.
అంతేకాక, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కూడా రూ. 17,500 చొప్పున బాకీ పడిందని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మహిళలు, రైతులు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ప్రజల 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి రూ. 30,000 చొప్పున బాకీ పడిందని తెలిపారు.
హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.