Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంభవించిన భారీ గ్యాస్ బ్లోఅవుట్ ఉదంతం పచ్చని ప్రకృతి ఒడిని అగ్నిగుండంగా మార్చేసింది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ సమీపంలోని ఓఎన్జీసీ ‘మోరి ఫీల్డ్-5’ బావి వద్ద సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ప్రమాదం, కోనసీమ ప్రజలను మరోసారి పాశర్లపూడి నాటి భయానక జ్ఞాపకాల్లోకి నెట్టింది. సుమారు 20 గంటలకు పైగా 100 అడుగుల ఎత్తున ఎగసిపడుతున్న అగ్నికీలలు కిలోమీటర్ల మేర కనిపిస్తుండగా, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. డ్రిల్లింగ్ సమయంలో అనూహ్యంగా పెరిగిన పీడనం కారణంగా గ్యాస్ లీకై, భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో సమీపంలోని కొబ్బరి తోటలు దగ్ధమయ్యాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పరిసర గ్రామాలన్నీ రాత్రంతా అంధకారంలో మగ్గిపోయాయి.
ఈ విపత్తుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి, సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బావిలో సుమారు 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉండవచ్చని అంచనా వేస్తుండగా, పీడనం తగ్గే వరకు మంటలను పూర్తిగా అదుపు చేయడం సవాలుగా మారింది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తుండగా, రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ఈ మంటల అదుపునకు కనీసం ఐదు రోజుల సమయం పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఇరుసుమండ గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు, బాధితులు ప్రాణభయంతో ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లడంతో పల్లెలు బోసిపోయాయి.
Also Read: Bandi Sanjay: తెలంగాణలో విద్యా వ్యవస్థ ఆగమైతోంది
ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన బ్లోఅవుట్ నియంత్రణ ఆపరేషన్ కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. మంటల వేడిని తగ్గించడానికి ‘వాటర్ అంబ్రెల్లా’ పద్ధతిని ఉపయోగిస్తూ, గూడపల్లి కాలువ నుంచి నీటిని మళ్లించి నిరంతరం బావిపై జల్లుతున్నారు. ఓఎన్జీసీ టెక్నికల్ టీమ్స్, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా అత్యున్నత స్థాయి రక్షణ చర్యలు చేపడుతున్నారు. అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్ల సహాయంతో బావి ముఖద్వారాన్ని మూసివేసేందుకు (వెల్ క్యాపింగ్) ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కోనసీమలో నెలకొన్న ఈ ఉత్కంఠభరిత పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఆపరేషన్ విజయవంతం అయ్యే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
