Kharge: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకు కుట్రలు పన్నుతోందని, పార్టీ ఎంపీలపై దాడులు చేసి వేధిస్తున్నదని ఆరోపించారు.
కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ, వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల ఇళ్లపై ఈడీ దాడులను తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది కాంగ్రెస్‌ను విచ్ఛిన్నం చేయాలనే కుట్ర. కానీ మేమంతా ఐక్యంగా ఉన్నాం. పార్టీలో చీలికకు అవకాశం లేదు,’’ అని ఖర్గే స్పష్టం చేశారు.
మోదీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఖర్గే, పదకొండేళ్ల పాలనలో 33 ముఖ్యమైన తప్పులు జరిగాయని ఆరోపించారు. ‘‘అబద్ధాలు చెప్పి, యువతను, పేదలను మోసం చేసి ఓట్లు సాధించడంలో మోదీకు సాటి లేరు. ఇంతకుముందెన్నడూ ఇలాంటి ప్రధానిను చూడలేదు. ప్రజల బాధలపట్ల ఆయనకు ఏమాత్రం శ్రద్ధ లేదు,’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.
ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకమా?
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇప్పటికీ ఖాళీగా ఉంచడాన్ని ఖర్గే తప్పుపట్టారు. ‘‘యూపీఏ హయాంలో మేమే ఆ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించామంటే, మోదీ సర్కార్ మాత్రం అలాంటి ప్రజాస్వామ్య పరంపరల్ని గాలికొదిలేసింది. ఈ విషయంలో మోదీకి అనేక లేఖలు రాసినా స్పందన లేదు. ఇది ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని సూచిస్తుంది,’’ అని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు.