Khairatabad Ganesh 

Khairatabad Ganesh: గవర్నర్ దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక అర్చనలు..!

Khairatabad Ganesh: భాగ్యనగరంలో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం 11:40 గంటలకు రాష్ట్ర గవర్నర్ దంపతుల చేతుల మీదుగా ఖైరతాబాద్ మహా గణపతికి శాస్త్రోక్తంగా తొలి పూజ నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తొలి పూజ పూర్తవడంతో సర్వదర్శనాలు ప్రారంభమై భక్తులు బడా గణేశుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు.

గవర్నర్ దంపతులు, మంత్రుల పూజలు..

రాష్ట్ర గవర్నర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలమాలలు సమర్పించి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని పూజలు నిర్వహించారు.

ప్రత్యేక ఆకర్షణగా 69 అడుగుల పంచముఖ మహా గణపతి..
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఈసారి ఏకంగా 69 అడుగుల భారీ ఎత్తులో విగ్రహాన్ని రూపొందించారు. భక్తులకు ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో కొలువైన బడా గణేశుడు నేత్రపర్వంగా దర్శనమిస్తున్నారు.

పటిష్టమైన భద్రత – ట్రాఫిక్ ఆంక్షలు..

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి తొక్కిసలాట, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా బారికేడ్లు, క్యూలైన్ల నిర్వహణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతూ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *