Bricks

BRICS: 18వ బ్రిక్స్ సదస్సు విజయవంతంపై చంద్రబాబు, పవన్

BRICS: దేశ రాజధాని న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సును భారత్ అత్యంత విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. విభిన్న భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ఉన్న అగ్రదేశాలను ఏకతాటిపైకి తెచ్చి ఏకాభిప్రాయ సాధన చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శించిన నాయకత్వ పటిమను వారు కొనియాడారు. ప్రపంచ వేదికపై భారత్ స్వరం గతంలో ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో, అంతర్జాతీయ గౌరవంతో ప్రతిధ్వనిస్తోందని ఇరువురు నేతలు పేర్కొన్నారు.

విశ్వసనీయ వేదికగా భారత్ – సీఎం చంద్రబాబు ప్రశంసలు..

సోమవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధాని మోదీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.. ప్రపంచవ్యాప్తంగా అనేక భౌగోళిక రాజకీయ సవాళ్లు, ఆర్థిక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ప్రపంచంలోని అగ్ర ఆర్థిక వ్యవస్థలను భారత్ ఒకచోట చేర్చి సదస్సును విజయవంతంగా నడిపించడం గర్వకారణమన్నారు.
బహుపాక్షిక అంతర్జాతీయ సంస్థల బలోపేతం, పటిష్టమైన సరఫరా గొలుసులు (సప్లై చైన్స్), సరికొత్త ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాల మధ్య సహకారానికి ఈ డిక్లరేషన్ పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధిని నడిపించే అంశాలు ఇవేనని స్పష్టం చేశారు.
భిన్నాభిప్రాయాలు ఉన్న దేశాలు సైతం ఒకచోట కూర్చుని సామరస్యపూర్వకంగా చర్చించుకునేందుకు భారత్ అత్యంత విశ్వసనీయమైన గ్లోబల్ వేదికగా అవతరించిందని, ఇది ప్రపంచంలో పెరుగుతున్న భారత ఆర్థిక బలానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.
chandrababu
గ్లోబల్ సౌత్ వాణికి బలం – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
సదస్సు విజయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, భారత్ బ్రిక్స్ ఛైర్‌షిప్‌ను సమర్థంగా నిర్వహించడం దేశానికే గర్వకారణమన్నారు..ప్రపంచ జనాభాలో దాదాపు 50 శాతం, గ్లోబల్ జీడీపీలో 40 శాతం వాటా కలిగిన బ్రిక్స్ కూటమి.. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. “స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత” అనే నినాదంతో ప్రధాని మోదీ అందించిన నిర్మాణాత్మక నాయకత్వాన్ని పవన్ అభినందించారు.
ఈ విజయంలో పాలుపంచుకున్న కేంద్ర విదేశాంగ శాఖ, దౌత్య బృందాలు, అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార-ఇంధన భద్రతలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఉగ్రవాద నిర్మూలన, వాతావరణ మార్పులపై పోరు, ‘గ్లోబల్ సౌత్’ దేశాల హక్కులను పరిరక్షించడంలో ఈ సదస్సు మైలురాయిగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *