Keesara: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్లో మరో అవినీతి బాగోతం బట్టబయలైంది. కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీసర పరిధిలోని శిల్పా లేఅవుట్ (శిల్పా నగర్) వద్ద సోమవారం ఉదయం ఈ మెరుపు దాడి జరిగింది.
రెండు కేసుల్లో చార్జ్షీట్ల కోసం రూ.2 లక్షల డిమాండ్..
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ భూ వివాదం (భూ మోసం), అలాగే సెక్షన్ 498ఏ (వరకట్న వేధింపులు) కేసుల్లో ఓ వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు.
ఈ రెండు కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తి చేసి కోర్టులో చార్జ్షీట్లు సమర్పించాలని సదరు వ్యక్తి ఎస్ఐ శ్రీనివాస్‌ను ఆశ్రయించాడు. అయితే చార్జ్షీట్లు త్వరగా వేయాలంటే రూ.2 లక్షలు లంచంగా సమర్పించుకోవాలని, లేనిపక్షంలో ప్రక్రియను తీవ్రంగా ఆలస్యం చేస్తానని ఎస్ఐ నిక్కచ్చిగా తేల్చిచెప్పాడు.
శిల్పా లేఅవుట్లో రెడ్‌హ్యాండెడ్‌గా వలపన్నిన ఏసీబీ..
లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్ రూపొందించిన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఎస్ఐ సూచన మేరకు సోమవారం ఉదయం నాగారం పరిధిలోని కీసర శిల్పా లేఅవుట్ వద్దకు బాధితుడు రూ.2 లక్షల నగదుతో చేరుకున్నాడు.
బాధితుడి నుంచి ఎస్ఐ శ్రీనివాస్ ఆ లంచం సొమ్మును చేతిలోకి తీసుకోగానే మాటువేసిన ఏసీబీ బృందం మెరుపు దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది.అనంతరం ఎస్ఐ శ్రీనివాస్ చేతులకు కెమికల్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో, నగదును స్వాధీనం చేసుకుని ఆయనను కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించి లోతుగా విచారణ చేపట్టారు.
ఒకే స్టేషన్లో వరుస అవినీతి మరకలు..
కీసర పోలీస్ స్టేషన్ అవినీతి ఆరోపణలతో వరుసగా వార్తల్లో నిలవడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. గతంలో ఇదే స్టేషన్లో పనిచేస్తూ లంచం తీసుకుంటూ ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఏసీబీకి చిక్కిన సంగతి మరువకముందే.. తాజాగా ఎస్ఐ శ్రీనివాస్ దొరికిపోవడం గమనార్హం.
అంతేకాకుండా ఇటీవల కాలంలో ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి సైతం లంచం కేసుల్లో ఏసీబీకి చిక్కిన ఉదంతాల తర్వాత, మరో పోలీస్ అధికారి కటకటాలపాలవ్వడం ఖాకీ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఎస్ఐ శ్రీనివాస్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఆయనను ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
