Nvidia CEO: ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ (AI) చిప్‌ల తయారీ దిగ్గజం ‘ఎన్విడియా’ (Nvidia) సీఈవో జెన్సన్ హువాంగ్ (Jensen Huang) చుట్టూ పెను వివాదం ముసురుకుంది. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్ (Alice Huang) అనే మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆయన స్వయంగా అంగీకరించారు. 4 ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన ప్రపంచ అగ్రగామి సంస్థ అధినేత కావడంతో పాటు, ఈ వ్యవహారంలో చైనా గూఢచర్యం, అధునాతన ఏఐ చిప్‌ల అక్రమ రవాణా కోణాలు ముడిపడి ఉండటంతో అమెరికా నిఘా వర్గాలు, టెక్ వర్గాల్లో ఈ అంశం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
భార్యకు క్షమాపణలు చెబుతూ ఉద్యోగులకు లేఖ..
ఎన్విడియా ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో జెన్సన్ హువాంగ్ తన తప్పును బహిరంగంగా ఒప్పుకున్నారు. నేను నా భార్యకు ద్రోహం చేశాను. నా చర్యలు ఆమెను, నా పిల్లలను తీవ్రంగా బాధించాయి. నేను చేసిన తప్పుకు ఎలాంటి సమర్థన లేదు. నా కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.
క్షమాపణలు నా తప్పును సరిదిద్దలేవని నాకు తెలుసు. కాలక్రమేణా నా కుటుంబం ఈ గాయం నుంచి కోలుకుంటుందని, మళ్లీ వారి నమ్మకాన్ని గెలుచుకోగలనని ఆశిస్తున్నాను అని జెన్సన్ లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యక్తిగత వివాదం నేపథ్యంలో ఆయన కుమార్తె మాడిసన్ హువాంగ్, సియోల్‌లో జరగాల్సిన ‘ఎన్విడియా ఏఐ డే 2026’ పర్యటనను కుటుంబ సమస్యల కారణంతో రద్దు చేసుకున్నారు.
ఎవరీ ఆలిస్ హువాంగ్? చైనా గూఢచర్య ఆరోపణలేంటి?
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. చైనా పౌరురాలైన ఆలిస్ హువాంగ్ (హువాంగ్ లే) గతంలో చైనా ప్రభుత్వ రంగ మీడియా ఛానళ్లు హునాన్ టీవీ, సీసీటీవీలలో రిపోర్టర్‌గా పనిచేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత హెచ్ఎస్బీసీ (HSBC), సీఐటీఐసీ సెక్యూరిటీస్, షాంఘై హెక్సీ ఇన్వెస్ట్మెంట్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల కథనం ప్రకారం.. చైనా ప్రధాన నిఘా సంస్థ ‘మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ’ (MSS) జెన్సన్ హువాంగ్, ఎన్విడియా టెక్నాలజీపై సమాచారం సేకరించేందుకు ఆలిస్‌ను రంగంలోకి దించింది.అమెరికా ఏఐ పరిజ్ఞానం, కంపెనీ అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు ఆమె జెన్సన్ హువాంగ్‌తో వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని పెంచుకున్నట్లు యూఎస్ నిఘా వర్గాలు నిర్ధారించాయి.
మెగాస్పీడ్ కంపెనీ – రూ. 40,000 కోట్ల ($4.8 బిలియన్) చిప్స్ స్మగ్లింగ్ వివాదం..
సింగపూర్ కేంద్రంగా నడిచే ‘మెగాస్పీడ్’ (Megaspeed) కంపెనీలో ఆలిస్ హువాంగ్ కీలక పాత్ర పోషించారు.చైనాపై అమెరికా విధించిన ఏఐ చిప్ ఎగుమతి ఆంక్షలను దాటవేసేందుకు మెగాస్పీడ్ ద్వారా అక్రమ మార్గాల్లో ఎన్విడియా చిప్‌లను చైనాకు తరలిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
మెలేషియాలోని మెగాస్పీడ్ సిస్టర్ కంపెనీ జూన్ 2024 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో ఏకంగా 4.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 40,000 కోట్లకు పైగా) విలువైన అధునాతన ఎన్విడియా ఏఐ ఎక్విప్మెంట్ను కొనుగోలు చేసినట్లు తేలింది.
2024 చివర్లో మలేషియా డేటా సెంటర్‌ను తనిఖీ చేసిన యూఎస్ వాణిజ్య శాఖ అధికారులు.. ఆ పరికరాలను ఇన్స్టాల్ చేయకుండా పెట్టెలలోనే ఉంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో జరిపిన నిఘా ద్వారానే జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్‌కు ఉన్న సంబంధం బయటపడింది.
జెన్సన్ కుటుంబ నేపథ్యం..
భార్య లోరీ హువాంగ్: ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో (జెన్సన్కు 17, ఆమెకు 19 ఏళ్ల వయసులో) లోరీ పరిచయమయ్యారు. 1985లో వీరు వివాహం చేసుకున్నారు. 1993లో ఎన్విడియాను స్థాపించడంలో ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం ఆమె కుటుంబానికి చెందిన 9 బిలియన్ డాలర్ల ఛారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
పిల్లల బాధ్యతలు: కుమార్తె మాడిసన్ ఎన్విడియాలో సీనియర్ డైరెక్టర్ (ఆమ్నివర్స్ విభాగం) కాగా, కుమారుడు స్పెన్సర్ రోబోటిక్స్ విభాగంలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మాడిసన్ భర్త నికో కాప్రెజ్ కూడా ఎన్విడియాలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
ప్రస్తుతం ఎన్విడియా సంస్థతో పాటు మెగాస్పీడ్ లావాదేవీలపై యూఎస్ ఇంటెలిజెన్స్ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో సీఈవోగా జెన్సన్ హువాంగ్ భవిష్యత్తు మరియు కంపెనీ తదుపరి నాయకత్వంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది.
