KARNATAKA CM: చెన్నైలో ఇటీవల నిర్వహించిన ‘థగ్ లైఫ్’ సినిమా కార్యక్రమంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో తీవ్రమైన రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. ఈ ఈవెంట్‌లో ఆయన కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఇక్కడ నాకు కుటుంబం ఉంది. అందుకే వచ్చాను. మీ భాష కూడా తమిళం నుంచే పుట్టింది,” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడ భాషను కించపరిచినట్లుగా భావించిన పలువురు నేతలు, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కమల్ వ్యాఖ్యలను ఖండించారు. మీడియాతో మాట్లాడుతూ, “కన్నడ భాషకు గొప్ప చరిత్ర ఉంది. పాపం, కమల్ హాసన్‌కు ఆ చరిత్రపై సరైన అవగాహన లేదు,” అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీనే కాదు, ప్రతిపక్ష బీజేపీ కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బి.ఎస్. యడియూరప్ప కుమారుడు బి.వై. విజయేంద్ర మాట్లాడుతూ,
“తన మాతృభాషను ప్రేమించడం తప్పు కాదు. కానీ ఇతర భాషలను తక్కువగా చూడడం సరికాదు. కమల్ హాసన్ వెంటనే కన్నడ ప్రజల్ని క్షమాపణ కోరాలి,” అని డిమాండ్ చేశారు.