Jagan: టీడీపీ మహానాడు పై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి హామీలపై సీరియస్‌గా నిలదీశారు. “మహానాడు అనేది ఓ పెద్ద డ్రామా. ప్రజలకు మోసం చేసే తెలుగు డ్రామా పార్టీ కదా!” అంటూ జగన్ విరుచుకుపడ్డారు.
చంద్రబాబు కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన అది నాయకత్వ సత్తా కాదన్నారు. హామీలను నెరవేర్చడమే నిజమైన సత్తా అని స్పష్టం చేశారు. “టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలేమయ్యాయో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 143 హామీలను పక్కనపెట్టి, ఉచిత బస్సు వంటి చిన్న హామీ కూడా ఇవ్వలేకపోయారు” అని ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడిన జగన్, “99 శాతం హామీలను నెరవేర్చాం. ప్రతి ఇంటికీ మేలు చేశాం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం” అని గుర్తు చేశారు.
ఆరోగ్యశ్రీ, నాడు-నేడు, విద్యా హక్కులు, రైతు భరోసా వంటి పథకాలను టీడీపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. వలంటీర్లు, ఉద్యోగుల తొలగింపులతో లక్షల మందిని నిరుద్యోగులయ్యేలా చేశారని విమర్శించారు.
“ప్రజల సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించాం. టీడీపీ నాయకులు తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. ఇది దౌర్భాగ్య పాలన,” అని జగన్ అన్నారు. చివరిగా, “వైఎస్సార్ కాంగ్రెస్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. న్యాయం జరిగేలా చూస్తాం,” అని హామీ ఇచ్చారు.