Moinabad Drugs Case

Moinabad Drugs Case: రోహిత్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. డ్రగ్స్ కేసులో వెలుగులోకి ‘కేదార్’ మిస్టరీ!

Moinabad Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు తాజాగా కీలక ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డిలకు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ‘కేదార్’ అనే వ్యక్తి పేరు ప్రధానంగా తెరపైకి రావడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పోలీసుల విచారణలో కేదార్ అనే వ్యక్తికి, రోహిత్ రెడ్డి సోదరులకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. గతేడాది దుబాయ్‌లో డ్రగ్స్ మోతాదు ఎక్కువై కేదార్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే, కేదార్ మరణానికి ముందు రోహిత్ రితేష్ బ్యాంక్ ఖాతా నుండి సుమారు 25 లక్షల రూపాయలు అతనికి బదిలీ అయినట్లు పోలీసులు ఆధారాలు సంపాదించారు. ఈ డబ్బును డ్రగ్ పార్టీల నిర్వహణ కోసమే పంపించారా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న పోలీసులు.. రోహిత్ రెడ్డి, రితేష్‌లను ఈ నగదు బదిలీపై ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. దీంతో వాస్తవాలను బయటకు తీసేందుకు పోలీసులు వారి కస్టడీని పొడిగించాలని కోర్టులో పిటిషన్ వేశారు. కేదార్‌తో వీరికి ఉన్న సంబంధాలు, అలాగే డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలతో వీరికి ఉన్న లింకులపై స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం ఇప్పటికే రంగంలోకి దిగి డ్రగ్ పార్టీలకు ఎవరెవరు హాజరయ్యారు? అంతర్జాతీయంగా, ముఖ్యంగా దుబాయ్‌తో ఈ ముఠాకు ఉన్న సంబంధాలు ఏంటి? అనే అంశాలపై ఆరా తీస్తోంది. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *