Tirupati Stampede: సాధారణంగా ఏదైనా టికెట్లు ఇచ్చే దగ్గర.. టోకెన్లు జరీ చేసే దగ్గర ఎక్కువగా రద్దీ ఉన్నపుడు లైనులో నిలుచున్నవారిలో అసహనం పెరిగిపోతుంది. ఆ అసహనంలో చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అవి ఒక్కోసారి పెద్ద గందరగోళం సృష్టిస్తాయి. తిరుపతి ఘటనలో కూడా అదే జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ ప్రక్రియలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, మరో 50మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరుపతి రూయా, సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ నేపథ్యంలో అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా అక్కడ వెనుకవైపు లైనులో ఉన్నవారి అపోహ ఇంతటి ఉపద్రవం తెచ్చినట్టు తెలుస్తోంది.
కారణమిదేనా?
వైకుంఠ ఏకాదశికి శీవారి దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాట్స్ కేటాయించి టోకెన్లు జరీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రచారమూ గట్టిగానే జరిగింది. ఈనెల 10 నుంచి 13 వరకూ మూడు రోజులకు గురువారం ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు జరీ చేస్తారని చెప్పారు. దీంతో బుధవారం రాత్రి నుంచే పెద్ద ఎత్తున భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకోవడం మొదలైంది. క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు కాకుండా.. ఇంకా ఎక్కువమంది భక్తులు టోకెన్ల కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్ వద్ద పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. అక్కడ తీవ్ర సంఖ్యలో భక్తులు వచ్చి చేరారు. దీంతో కొంతమందిని అక్కడ నుంచి పద్మావతి పార్క్ లోకి తరలించారు. ఇదే సమయంలో క్యూ లైన్ లో ఉన్న ఒక వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో ఆయాస పడుతూ కూలబడింది. దీంతో టీటీడీ సిబ్బంది ఆమెను బయటకు తీసుకువచ్చి గేటులోపలికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కొంతమంది లైనులో ఉన్న భక్తులు కూడా టీటీడీ సిబ్బందికి సహకరించారు.
ఇది కూడా చదవండి: Chandrababu: మీరంతా ఏమి చేస్తున్నారు? టీటీడీ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం! ఈరోజు తిరుపతికి సీఎం
వెనుకవైపు ఉన్నవారికి విషయం అర్ధం కాలేదు. అసలే లైనులో తీవ్ర అసహనంతో ఉన్న వారు ఎవరినో అక్రమంగా సిబ్బంది లోపలి గేటు తీసి పంపిస్తున్నారని అపోహ పడ్డారు. దీంతో అక్కడ కేకలు, అరుపులు మొదలయ్యాయి. ఇక్కడ సిబ్బంది ఆ వృద్ధురాలిని కాపాడాలని ప్రయత్నిస్తుంటే, అక్కడ జనం అక్రమం జరిగిపోతోంది తోపులాటకు దిగారు. ఆ గేటునుంచి లోపలి వెళ్లిపోవచ్చని బలంగా ముందుకు చొచ్చుకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో చాలామంది కింద పడిపోయారు. దీంతో తొక్కిసలాట మొదలైంది. చాలామంది ఊపిరి ఆడక అస్వస్థులయ్యారు. తొక్కిసలాటలో కింద పడిన వారు తీవ్రంగా గాయపడ్డారు.
ఆ ఇద్దరే కారణమా?
వెనుక నుంచి జరిగిన తోపులాటకు ఇద్దరు వ్యక్తులు కారణమని అక్కడి భక్తులు ఆరోపిస్తున్నారు. వారు తోపులాటకు ప్రేరేపించారని ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్కడ ఏదైనా కుట్రకోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు తోపులాట ప్రారంభం ఎలా అయింది? ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అనే విషయాలను సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గుర్తించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు.