BRICS: న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. బ్రిక్స్ కూటమి ఏర్పాటై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అత్యంత కీలకమైన అజెండాపై దృష్టి సారించింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి విదేశాలకు పారిపోతున్న ఆర్థిక నేరగాళ్లను (Fugitive Economic Offenders) త్వరితగతిన భారత్‌కు రప్పించడం, వారి అక్రమ ఆస్తులను రికవరీ చేయడమే లక్ష్యంగా ఒక పటిష్టమైన అంతర్జాతీయ కార్యాచరణను బ్రిక్స్ దేశాల ముందు ఉంచనుంది.
కొత్త ఫ్రేమ్‌వర్క్‌తో దక్కనున్న ఊరట – ఆలస్యానికి చెక్..
ప్రస్తుతం అమలులో ఉన్న సంక్లిష్టమైన చట్టపరమైన నిబంధనలు, సుదీర్ఘ ప్రక్రియల కారణంగా విదేశాలకు పారిపోయిన నేరగాళ్లు ఏళ్ల తరబడి తప్పించుకుంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ రూపొందించిన ముసాయిదాలో కీలక అంశాలు ఉన్నాయి..
వేగవంతమైన నిఘా సమాచార మార్పిడి
ప్రాథమిక దర్యాప్తు దశలోనే బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఒక నిర్దిష్ట ఫార్మాట్‌లో సమాచారాన్ని, ఇంటెలిజెన్స్ డేటాను వేగంగా పంచుకుంటారు.
ఆస్తుల రికవరీకి ప్రత్యేక నియమాలు..
నేరగాళ్లు విదేశాల్లో కూడబెట్టిన లేదా దాచిన స్థిర, చరాస్తులను గుర్తించి తక్షణమే స్తంభింపజేయడం (Freeze), రికవరీ చేయడానికి ఉమ్మడి నిబంధనలు తెస్తారు.
సానుకూల స్పందన..
ఇటీవల బ్రిక్స్ దర్యాప్తు సంస్థల నెట్‌వర్క్ సమావేశంలో భారత్ ప్రతిపాదించిన ఈ అంశంపై సభ్య దేశాల నుంచి మంచి స్పందన లభించింది. ఢిల్లీ సదస్సులో దీనిని అధికారికంగా ఆమోదించే అవకాశముంది.
నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల కేసులకు దక్కనున్న మేలు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాల్లో తలదాచుకున్న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి బడా నిందితుల అప్పగింత కోసం భారత్ ఏళ్ల తరబడి పోరాడుతోంది. ప్రస్తుతం వీరి కేసులు బ్రిటన్, బెల్జియం దేశాల కోర్టుల్లో సాగుతున్నాయి.
ఆర్థిక నేరాలు సరిహద్దులు దాటి బహుళ దేశాల చట్టాలతో ముడిపడి ఉన్నందున.. ఈ నూతన వ్యవస్థ ద్వారా విచారణ సంస్థలు ప్రారంభం నుంచే నేరుగా సమన్వయంతో పనిచేసే అవకాశం లభిస్తుంది.
వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో)పై ప్రత్యేక నిఘా..
నేటి ఆధునిక కాలంలో ఆర్థిక నేరగాళ్లు విచారణల నుంచి తప్పించుకోవడానికి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లు, క్రిప్టోకరెన్సీల వంటి వర్చువల్ డిజిటల్ ఆస్తులను (VDA) ఆశ్రయిస్తున్నారు.
ఈ క్రిప్టో లావాదేవీలను ట్రాక్ చేయడం, అక్రమ డిజిటల్ ఆస్తులను సీజ్ చేయడం కోసం బ్రిక్స్ ఫ్రేమ్‌వర్క్‌లో ప్రత్యేక నిబంధనలను చేర్చారు.గతంలో భారత్ జి-20 (G20) అధ్యక్షతన ఉన్న సమయంలోనూ క్రిప్టో ఆస్తుల నియంత్రణకు గ్లోబల్ పాలసీని బలంగా ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
గాంధీనగర్‌లో బ్రిక్స్ నిపుణులకు ప్రత్యేక శిక్షణ..
సదస్సుకు సన్నాహకంగా భారత రెవెన్యూ విభాగం, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) సంయుక్తంగా ఒక ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి..
-
వేదిక: గుజరాత్‌లోని గాంధీనగర్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (RRU).
-
తేదీలు: సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు.
-
బ్రిక్స్ దేశాలకు చెందిన పాలసీ మేకర్లు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లు (FIU), దర్యాప్తు సంస్థల నిపుణులు ఇందులో పాల్గొంటున్నారు. ఆర్థిక నేరాలపై మరింత కఠినంగా, వేగంగా వ్యవహరించేందుకు వీలుగా సంస్థల సామర్థ్యాన్ని పెంచే వ్యూహాలను ఇక్కడ చర్చిస్తున్నారు.
