Bandi Sanjay

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్..!

Bandi Sanjay: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను బీఆర్ఎస్ నాయకులు అసభ్య పదజాలంతో దూషించడాన్ని ప్రజాస్వామ్యవాదులెవరూ జీర్ణించుకోలేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు, అసెంబ్లీ గేటు వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న బీఆర్ఎస్ నేతలను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని, ఇరు పార్టీల నేతలు వాడుతున్న ‘బజారు భాష’ను చూసి ప్రజలు అసహ్యించుకుంటూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌పై హత్యాయత్నమనేది పెద్ద జోక్

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ దాడి చేసిందని, కేసీఆర్‌పై హత్యాయత్నం జరిగిందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు ఒక పెద్ద హాస్యాస్పదమైన ‘జోక్’ అని కొట్టిపారేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ అనే కలుగులో దాక్కున్నారని విమర్శించారు.
“అసెంబ్లీ సమావేశాలకే రాని కేసీఆర్‌కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? ఆయన సభకు వచ్చేలా కనీసం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించండి” అంటూ ఎద్దేవా చేశారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండూ పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజలను, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసే సంస్కృతినే ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు.
ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీ..
రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ సమస్యలను ప్రస్తావిస్తూ బండి సంజయ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 22A రిజిస్ట్రేషన్ల వివాదాలతో సామాన్య ప్రజలు అల్లాడుతుంటే, అధికార పార్టీ మంత్రులు, నేతలు వేల కోట్ల విలువైన భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక, సర్టిఫికెట్లు చేతికి రాక లక్షలాది మంది విద్యార్థులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలో సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతుంటే, ఉద్యోగాలు లేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు మూతపడి నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు శరీరానికి కనీస దెబ్బలు కూడా తగలకపోయినా, ఏదో పెద్ద దాడి జరిగినట్లు నాటకాలు ఆడుతూ నటన ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాబోయేది బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారే

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. రెండు పార్టీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకుతింటూ, అసలైన ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సంయుక్తంగా నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, దోపిడీ, పరస్పర డ్రామాలను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని.. త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని, ‘డబుల్ ఇంజిన్’ సర్కారుతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని బండి సంజయ్ తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *