YouTuber Nandana: నకిలీ విదేశీ వీసాల రాకెట్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు నందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాది, కుటుంబసభ్యులతో కలిసి సొంత వాహనంలో మంగళవారం ఆమె నేరుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ షెల్ కంపెనీల పేరిట నకిలీ ఆఫర్ లెటర్లు, నకిలీ వీసా డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా విక్రయించారంటూ నందన, ఆమె భర్త మధుకర్‌లపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి.
కేసు నేపథ్యం – శంషాబాద్ వద్ద అదుపులోకి
యూకే (లండన్)లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారీగా నగదు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితుడు శివక్రాంతి గతేడాది నవంబర్‌లో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసు నమోదైనప్పటి నుంచి లండన్‌లోనే ఉన్న నందన దంపతులపై పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు.
పోలీసులు ఆమెకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు అందజేసి, మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్టేషన్‌కు చేరుకున్న నందనను అధికారులు ముమ్మరంగా ప్రశ్నిస్తున్నారు. షెల్ కంపెనీల నెట్‌వర్క్, ఎంతమంది బాధితుల నుంచి ఎంత నగదు వసూలు చేశారు, నిధుల మళ్లింపు ఎక్కడికి జరిగిందనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 10 కోసమే భారత్‌కు వచ్చారా?..
నందన ఆకస్మికంగా హైదరాబాద్ రావడానికి గల కారణాలపై ప్రస్తుతం సోషల్ మీడియా, బుల్లితెర వర్గాల్లో సరికొత్త ప్రచారం ఊపందుకుంది. తాజాగా సెప్టెంబర్ 6న ఘనంగా ప్రారంభమైన ‘బిగ్ బాస్ తెలుగు 10’ రియాలిటీ షోలోకి నందన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేందుకు నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా ‘నందూస్ వరల్డ్’ దంపతుల పేర్లు బిగ్‌బాస్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
పోలీస్ కేసు పెండింగ్‌లో ఉన్నందున, న్యాయపరమైన అడ్డంకులు, విచారణను క్లియర్ చేసుకుని వస్తేనే హౌస్‌లోకి పంపుతామని నిర్వాహకులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకే కేసు వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు ఆమె ఇండియాకు వచ్చారని, అయితే ఎయిర్‌పోర్టుకు రాగానే లుక్ ఔట్ నోటీసులతో పోలీసులకు చిక్కారని సమాచారం.
ఈ విచారణలో నకిలీ వీసా రాకెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు ఆమె లీగల్ అడ్డంకులను అధిగమించి నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
