YSRCP: ఉత్తరాంధ్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైఎస్సార్సీపీకి అనూహ్యంగా గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త (ఇన్ఛార్జ్) బాధ్యతలకు ఆయన అధికారికంగా రాజీనామా చేశారు. ఈ పరిణామం ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కీలక పదవులన్నింటికీ రాజీనామా..
ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతంలో సుదీర్ఘకాలం క్రియాశీలక పాత్ర పోషించిన చిన్న శ్రీను, జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా పరిధిలోని కీలకమైన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఆయన, ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ కుటుంబానికి చిన్న శ్రీను అత్యంత సన్నిహితుడు, స్వయానా మేనల్లుడు కావడంతో ఆయన నిష్క్రమణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర ఉత్కంఠ..
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న వేళ, ఉత్తరాంధ్రలో అత్యంత బలమైన నాయకుడిగా పేరొందిన మజ్జి శ్రీనివాసరావు రాజీనామా చేయడం ఆ పార్టీకి కోలుకోలేని నష్టంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన భవిష్యత్ రాజకీయ అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి? అధికార కూటమిలోని టీడీపీ లేదా జనసేన వైపు మొగ్గు చూపుతారా లేక స్వతంత్రంగా వ్యవహరిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
