Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో కోర్టు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలను దోషులుగా తేల్చింది. ఈ తీర్పులో భాగంగా ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష, బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అలాగే, ఇమ్రాన్ ఖాన్‌కు పది లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా, బుష్రా బీబీకి ఐదు లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధించారు.
ఈ తీర్పును రావల్పిండిలోని అడియాలా జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయమూర్తి చదివి వినిపించారు.
అల్ ఖాదిర్ ట్రస్టు కేసు వివరాల
లండన్‌లో నివసిస్తున్న పాకిస్థానీ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి బ్రిటన్ ప్రభుత్వం 19 కోట్ల పౌండ్లను పాకిస్థాన్‌కు పంపింది. అయితే, ఆ డబ్బును జాతీయ ఖజానాలో జమ చేయకుండా, ఇమ్రాన్ దంపతులు గోల్‌మాల్ చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
వారిపై ఉన్న ప్రధాన అభియోగం ప్రకారం, సుప్రీంకోర్టు రియాజ్ హుస్సేన్‌కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఈ డబ్బు నుంచి కట్టడించారని, ఇందుకు బదులుగా రియాజ్ హుస్సేన్ “అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయం” కోసం 57 ఎకరాల భూమిని ఇమ్రాన్ దంపతులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల సంఖ్య
ఇమ్రాన్ ఖాన్‌పై ఇప్పటివరకు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. 2023 ఆగస్టు నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు.