illegal drugs:పెద్ద ఎత్తున నిషేధిత డ్రగ్స్ పట్టుబడుతున్నా.. మళ్లీ మళ్లీ దొరుకుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఏకంగా అంతర్రాష్ట్ర నిందితులు హైదరాబాద్ నగరంలో తిష్ఠ వేసి ఏకంగా అమ్మకాలు చేపడుతున్నారు. అలాంటి వారిని కూడా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుంటున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తరచూ దొరికిపోతుండటంతో నిందితులు కొత్త దారులు వెతుకుతున్నారు. ఆ దారుల్లో చేరవేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులకు నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి.
illegal drugs:రాజస్థాన్‌కు చెందిన మహేశ్, మహిపాల్ నేరేడ్‌మెట్ పరిధిలో స్థిరపడ్డారు. వారు డ్రగ్స్‌ను కొనుగోలు చేసుకొని వచ్చి హైదరాబాద్‌లో వినూత్న తరహాలో వినియోగదారులకు చేరవేస్తున్నారని తేలింది. నిందితులు గ్యాస్ సిలిండర్ మరమ్మతు చేసే వారిగా పనిచేస్తున్నారు. దీంతో గ్యాస్ రిపేర్ చేసే పరికరాల్లో డ్రగ్స్‌ను ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నట్టు తేలింది. గ్యాస్ సిలిండర్ వాల్వ్‌లలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
illegal drugs:ఎవరికీ అనుమానం రాకుండా ఈ కొత్త టెక్నిక్‌ను వినియోగిస్తూ రాజస్థాన్ వాసులు డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్నారు. వాటిని వోలా, ఊబర్, ర్యాపిడో సహా ఇతర మార్గాల్లో కస్టమర్లకు చేరవేస్తున్నారు. 200 గ్రాముల హెరాయిన్ లక్ష రూపాయలకు కొనుగోలు చేసి, దానిని దాదాపు రూ.23 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన శంషుద్దీన్ అనే డ్రగ్ పెడ్లర్ నుంచి ఈ నిందితులు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అనుమానంతో వారిని పోలీసులు విచారించగా, వారి వద్ద 190 గ్రాముల హెరాయిన్ లభించింది. వారిని అరెస్టు చేసి వారి నుంచి బైక్, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద దొరికిన డ్రగ్స్ విలువ రూ.23 లక్షలు ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.