Bandi sanjay: భారతీయ జనతా పార్టీ (BJP)లో ఉండే ప్రతి ఒక్కరూ ఎంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో పనిచేసే కార్యకర్తను చివరి కోరిక ఏంటని అడిగితే.. తాను చనిపోయిన తర్వాత ఒంటిపై బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటారని ఆయన చెప్పారు. తాను ఎలాంటి వాడినో, తన వ్యక్తిత్వం ఏంటో పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఇతర పార్టీల నాయకులు డిమాండ్ చేయడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. లోక్‌సభలో కనీసం ఒక్క ఎంపీ కూడా లేని కేసీఆర్ పార్టీ నాయకులు, ఫామ్‌హౌస్‌లో కూర్చుని ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చేసి, వారి కుటుంబ పాలనకు చరమగీతం పాడింది తామేనని, అందుకే కక్షగట్టి తమపై లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఒక ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇదే సమయంలో తన కుమారుడి వివాదంపై బండి సంజయ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని నమ్మే వ్యక్తిని కాబట్టే, తప్పు ఒప్పుల విచారణకు సహకరించాలని తన కన్నకొడుకును తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని చెప్పారు. చరిత్రలో ఎక్కడైనా ఒక తండ్రి తన కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించిన సందర్భం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
