Hydra: హైడ్రా పై కమిషనర్ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొదట్లో హైడ్రా దూకుడుగా వ్యవహరించిందని తెలిపారు. ఈ కారణంగా ఇప్పుడు ప్రజలు ప్రాపర్టీ కొనేముందు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నారని చెప్పారు.
హైడ్రా ప్రగతిపై ముఖ్యాంశాలు:
ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించిందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 1,025 చెరువులను గుర్తించి వాటి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను నిర్ధారించేందుకు పని జరుగుతోందన్నారు.
హైడ్రాకు ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయి, వీటిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడించారు. ఇప్పటివరకు12 చెరువుల పునరుద్ధరణ, 72 డీఆర్‌ఎఫ్ బృందాల ఏర్పాటు చేసామన్నారు. హైడ్రా ఎఫ్‌ఎం ఛానల్ ద్వారా వాతావరణ అంచనాలను అందించడం జరుగుతుందన్నారు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. జూలై 19, 2024కు ముందు అనుమతులు పొందిన నివాస గృహాలను కూల్చడంలేదని, కానీ కమర్షియల్ భవనాలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు తమ ఫిర్యాదులు ప్రతీ సోమవారం హైడ్రా కార్యాలయంలో అందించవచ్చని తెలిపారు.