Hydra: హైదరాబాద్‌లో వరద ముప్పును తగ్గిస్తూ, పర్యావరణాన్ని కాపాడే దిశగా హైడ్రా (HYDRA) కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, నగర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికను రూపొందించింది. వర్షాకాలంలో నీరు నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా, నేరుగా చెరువుల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది.
తొలి దశగా, ఆరు చెరువులను పునరుద్ధరించేందుకు హైడ్రా శ్రమించుతోంది. చెరువులు, నాలాల పరిరక్షణ ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతగా హైడ్రా పేర్కొంది. అనేక చెరువులు, నాలాలు అక్రమ ఆక్రమణలకు గురవుతుండటం వల్లే వరదల సమస్య తీవ్రమవుతోందని హైడ్రా ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఆక్రమణలను అడ్డుకునేందుకు ప్రజల సహకారం అవసరమని స్పష్టం చేసింది. ప్రజలు తమ పరిసరాల్లో చెరువులు లేదా నాలాలు ఆక్రమణకు గురవుతున్నట్లు గమనిస్తే, వెంటనే సమాచారం అందించాలని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
ఈ సమాచారం కోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబర్ 8712406899 అందుబాటులో ఉంచింది. ఆక్రమణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ప్రాంత లొకేషన్‌ను ఈ నంబర్‌కు పంపవచ్చని తెలిపింది.
అదేకాదండి, ‘కమిషనర్ హైడ్రా’ పేరిట ఉన్న అధికారిక సోషల్ మీడియా ఖాతాలు – ఎక్స్ (ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా కూడా సమాచారం పంపొచ్చని సూచించింది. అత్యవసర సమయాల్లో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గారికి నేరుగా 7207923085 నంబర్ ద్వారా సమాచారం అందించవచ్చని పేర్కొంది.
చివరగా, చెరువుల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, అందరితో కలిసి పనిచేస్తేనే హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించవచ్చని హైడ్రా నమ్మకాన్ని వ్యక్తం చేసింది.