Madhapur

Madhapur: ఐటీ కారిడార్‌లో నీటి సంక్షోభం.. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల సమ్మెతో హాస్టళ్లు బెంబేలు.. నారాయణ కాలేజీకి దీపావళి వరకు సెలవులు!

Madhapur: హైదరాబాద్‌ మహానగరంలోని ఐటీ కారిడార్‌ను తీవ్ర నీటి ఎద్దడి ముంచెత్తింది. హైడ్రా (HYDRAA), రెవెన్యూ శాఖల ఆంక్షలకు నిరసనగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ఆకస్మిక సమ్మెతో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కాలేజీలు, వందలాది హాస్టళ్లు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నారాయణ కాలేజీకి దీపావళి వరకు సెలవులు..

నీటి ఎద్దడి తీవ్రత ఎంతలా ఉందంటే.. విద్యార్థుల ప్రాథమిక అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడటంతో విద్యాసంస్థలు క్లాసులను రద్దు చేసుకుంటున్నాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ప్రముఖ నారాయణ ఐఐటీ అకాడమీ క్యాంపస్‌లో నీటి కొరత కారణంగా జూనియర్, సీనియర్ విద్యార్థులకు యాజమాన్యం ముందస్తు సెలవులు ప్రకటించింది.

దీపావళి పండుగ ముగిసే వరకు సెలవులు ఇస్తున్నట్లు అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. సిలబస్ వెనుకబడకుండా ఉండేందుకు దీపావళి సెలవులు పూర్తయ్యేంత వరకు విద్యార్థులందరికీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.

రోడ్లపై వేల లీటర్ల నీళ్లు పారబోసి నిరసన.. వీడియో వైరల్!

హైడ్రా చర్యలను వ్యతిరేకిస్తూ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు మంగళవారం పలు ప్రాంతాల్లో విధులను బహిష్కరించారు. బంద్‌ను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన ఇతర ట్యాంకర్లను నిరసనకారులు అడ్డుకుని, వాటిలోని వేలాది లీటర్ల నీటిని ఉద్దేశపూర్వకంగా రోడ్లపైకి వదిలేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

నగరంలో తీవ్ర నీటి కొరత నెలకొన్న సమయంలో ఇలా ట్యాంకర్ల కొద్దీ తాగునీటిని రోడ్లపై పారబోసి వృథా చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తమ సంఘం పిలుపు మేరకు నగరవ్యాప్తంగా ప్రైవేట్ ట్యాంకర్లన్నీ బంద్ పాటించాలని, ఏ ఒక్కరూ రోడ్లపైకి రావొద్దని సమ్మెదారులు స్పష్టం చేశారు.

ట్యాంకర్ల సమ్మెకు అసలు కారణమేంటి?

ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు సమ్మె బాట పట్టడానికి ప్రధాన కారణాలు.

  1. హైడ్రా కొరడా: చెరువుల పరిరక్షణలో భాగంగా ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్లలో అక్రమంగా వేసిన బోరుబావులను హైడ్రా అధికారులు గత కొద్ది రోజులుగా వరుసగా సీజ్ చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఉన్న బోరుబావులను కూడా అధికారులు అక్రమంగా పరిగణించి సీజ్ చేస్తున్నారని, దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని ట్యాంకర్ల యజమానులు ఆరోపిస్తున్నారు.

  2. జలమండలి భారీ జరిమానాలు: నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. తాగునీటితో కార్లు కడిగినా, ఫ్లోరింగ్ శుభ్రం చేసినా జరిమానాలు విధిస్తుండగా.. నవంబర్ 1 నుంచి వాటర్ ట్యాంకర్ల నుంచి నీళ్లు లీక్ అవుతూ ప్రయాణిస్తే ఏకంగా రూ. 5,000 ఫైన్ విధిస్తామని ప్రకటించింది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకునేందుకు ‘పానీ’ (PANI) మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నిబంధనలన్నీ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ట్యాంకరు నిర్వాహకులు వాపోతున్నారు.

హాస్టళ్ల నిర్వాహకుల బెంబేలు.. పోలీసులను ఆశ్రయించిన వైనం..

ఐటీ కారిడార్‌లోని వందలాది ప్రైవేట్ హాస్టళ్లు, పీజీ (PG) వసతి గృహాలు పూర్తిగా ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడి నడుస్తున్నాయి.రెండు రోజులుగా ట్యాంకర్ల సమ్మె కొనసాగుతుండటంతో హాస్టళ్లలో కనీసం వంట చేయడానికి, స్నానాలకు నీళ్లు లేక బోర్డులు పెట్టే దుస్థితి తలెత్తింది.

దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంత హాస్టళ్ల నిర్వాహకులు శేరిలింగంపల్లి జోన్ డీసీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లను నడిపించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే వేలాది మంది టెక్కీలు వీధుల్లోకి వచ్చే ప్రమాదం ఉందని విజ్ఞప్తి చేశారు.

అధికారులు, ట్యాంకర్ల అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదం తక్షణమే పరిష్కారం కాకపోతే హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో సమస్య మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *