Cyclone Murasu 

Cyclone Murasu: తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిన ‘మురసు’.. 29 రైళ్లు రద్దు!

Cyclone Murasu: తీరప్రాంతాన్ని వణికించిన ‘మురసు’ తీవ్ర తుపాను (Cyclone Murasu) క్రమంగా బలహీనపడింది. తీరం దాటే ప్రక్రియ పూర్తిగా ముగిసిన అనంతరం, ఇది తీవ్ర అల్పపీడనంగా (Deep Depression) మారి తూర్పు తెలంగాణ, దానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేసింది. రాగల 12 గంటల్లో ఈ వ్యవస్థ మరింత బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

ఖమ్మం-నందిగామ సరిహద్దుల్లో కేంద్రీకృతం..

వాతావరణ శాఖ ఉదయం 5:30 గంటల పరిశీలనల వివరాల ప్రకారం. ఈ తీవ్ర అల్పపీడనం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర దిశగా కదిలింది. ప్రస్తుతం ఇది అక్షాంశం 17.0° ఉత్తరం, రేఖాంశం 80.1° తూర్పు సమీపంలో.. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు వాయవ్యంగా 30 కి.మీ, తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి దక్షిణంగా 30 కి.మీ, విజయవాడకు వాయవ్యంగా 80 కి.మీ, నల్గొండకు తూర్పుగా 90 కి.మీ, భద్రాచలానికి నైరుతిగా 110 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. మచిలీపట్నం, విశాఖపట్నంలలోని డాప్లర్ వెదర్ రాడార్ల (Doppler Radars) ద్వారా ఈ వాతావరణ వ్యవస్థ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కోస్తాంధ్ర జిల్లాలకు అలర్ట్.. 29 రైళ్లు రద్దు..

తుపాను తీవ్రత తగ్గినప్పటికీ దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్. కరుణా సాగర్ తెలిపారు. బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

రైళ్ల రాకపోకలు నిలిపివేత: పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ – ఒంగోలు – గూడూరు ప్రధాన రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మొత్తం 29 రైలు సర్వీసులను రద్దు లేదా దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ పీఆర్‌వో నుస్రత్ ఎమ్. మంద్రుప్కర్ వెల్లడించారు.

వరద సహాయక చర్యలు: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం గ్రామ పంచాయతీ కార్యాలయ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కొవ్వూరు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి వృద్ధులు, మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద: 70 గేట్లు ఎత్తివేత!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ప్రస్తుతం 60,875 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు 15 గేట్లను 2 అడుగుల మేర, 55 గేట్లను 1 అడుగు మేర (మొత్తం 70 గేట్లు) ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం పూర్తిస్థాయిలో 12 అడుగుల వద్ద నిలకడగా ఉంది.

తెలంగాణలోనూ 3 రోజుల పాటు భారీ వర్షాలు: హైదరాబాద్ రిపోర్ట్

తెలంగాణ వైపు తుపాను అవశేషాలు కదులుతుండటంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది:

  • హెచ్చరికలు జారీ అయిన జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

  • ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది.

  • హైదరాబాద్ వాతావరణం: నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *