Hyderabad Police

Hyderabad Police: వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ రూమర్స్‌పై హైదరాబాద్ పోలీసుల రియాక్షన్.. అసలు నిజం ఇదీ!

Hyderabad Police: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చిందని, దీనివల్ల మనం మాట్లాడే వాట్సాప్ కాల్స్ అన్నీ రికార్డ్ అవుతాయని, మన సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెడతారని ఆ పోస్టుల సారాంశం. ఈ వార్తలతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ ప్రచారంపై హైదరాబాద్ నగర పోలీసులు స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు.

వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రజలను భయపెట్టడానికి కొందరు ఆకతాయిలు సృష్టించిన తప్పుడు వార్త మాత్రమేనని తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇలాంటి అబద్ధపు వార్తలు వచ్చాయని, అప్పుడే తాము వీటిని ఖండించామని పోలీసులు గుర్తు చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను నమ్మి ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని సూచించారు.

నిజానికి వాట్సాప్ వంటి యాప్‌లు ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’ అనే సాంకేతికతతో పనిచేస్తాయి. అంటే మనం పంపే మెసేజ్‌లు లేదా మాట్లాడే కాల్స్.. పంపేవారికి, అందుకునేవారికి తప్ప మధ్యలో ఉన్న థర్డ్ పార్టీకి, చివరికి వాట్సాప్ కంపెనీకి లేదా ప్రభుత్వానికి కూడా చూసేందుకు గానీ, వినేందుకు గానీ వీలుండదు. కాబట్టి వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవ్వడం అనేది అసాధ్యం.

ఇలాంటి అబద్ధపు వార్తలను పుట్టించేవారిపై, అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బాధ్యతగల పౌరులుగా ప్రజలంతా అధికారిక సమాచారం లేకుండా వచ్చే మెసేజ్‌లను నమ్మకూడదని కోరారు. ఏదైనా పోస్ట్‌ను ఇతరులకు షేర్ చేసే ముందు అది నిజమో కాదో సరిచూసుకోవాలని, అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *