DK Shivakumar: కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం లోక్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో జరిగిన ఘనమైన వేడుకలో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శివకుమార్ చేతిలో చిన్న రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని ప్రమాణం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రమాణానికి ముందు ఆయన వేదికపై నుంచి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు. అలాగే వేదికపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యను ఆయన ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ అట్టహాసమైన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, వీడీ సతీశన్, సుఖ్విందర్ సింగ్ సుఖు మరియు ఇతర ఏఐసీసీ నేతలు ఈ వేడుకలో పాల్గొని డీకే శివకుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రితో పాటు జి. పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు మరో 12 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కొత్త మంత్రివర్గంలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలకు చోటు దక్కింది. వీరితో పాటు కేహెచ్ మునియప్ప, కె.జె.జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి, కృష్ణబైరి గౌడ, యు.టి.ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు.
