P. V. N. Madhav

P. V. N. Madhav: చెప్పాం.. చేస్తున్నాం” నినాదంతో స్థానిక సమరంలోకి కూటమి

P. V. N. Madhav: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్డీయే కూటమి సంపూర్ణ సమన్వయంతో, విజయమే లక్ష్యంగా సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన కూటమి నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “చెప్పాం.. చేస్తున్నాం” అనే దృఢమైన నినాదంతో ప్రజా సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా ఎన్నికల బరిలోకి వెళ్తున్నామని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీలు సుదీర్ఘమైన కసరత్తు జరిపి, అభ్యర్థుల ఎంపికలో అత్యుత్తమ ఏకాభిప్రాయాన్ని సాధించాయని పేర్కొన్నారు.

కూటమిలో చీలికలు రావన్నది స్పష్టమైంది
సీట్ల సర్దుబాటు సమయంలో కూటమిలో విభేదాలు వస్తాయని, పొత్తులో బీటలు వారుతాయని భావించిన ప్రత్యర్థుల ఆశలు అడియాసలయ్యాయని మాధవ్ అన్నారు. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మూడు పార్టీలు ఒకే తాటిపైకి వచ్చాయని తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నాయకత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి కింది స్థాయి వరకు సమన్వయం కుదిర్చారని వివరించారు. ఈ బలమైన ఐక్యతతోనే గతంలో ఎదురైన ప్రకృతి వైపరీత్యాలు, సూపర్ ఎల్‌నినో వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.
ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్‌తో రాష్ట్రాభివృద్ధి
సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్పే ‘డబుల్ ఇంజిన్ సర్కార్ – ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్’ మాటలు అక్షరాలా నిజమవుతున్నాయని మాధవ్ కొనియాడారు. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమన్వయంతో రాష్ట్రం వేగవంతమైన ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నామని, ఇందుకు రాష్ట్ర ప్రజలందరి సంపూర్ణ ఆశీస్సులు అవసరమని ఆయన కోరారు.
సార్వత్రిక ఎన్నికల ఐక్యత పునరావృతం
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదర్శించిన అపూర్వమైన ఐక్యతను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మరోసారి చాటుతామని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ కూటమి అభ్యర్థుల భారీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి విభేదాలకు తావులేకుండా కలిసికట్టుగా సాగుతున్న కూటమిని స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు ఘనంగా ఆదరిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసి బరిలోకి దిగుతోందని బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో సమన్వయంతో పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *