Hyderabad News: అమ్మా ఆకలేస్తుంది.. అన్నం పెట్టు.. ఇది నోరు తెరిచి ఓ బాలిక అడిగిన మాట కాదు.. సైగతో కుడి చేయిని నోటి వద్ద పెట్టి చూపుతూ, కడుపును మరో చేతితో తడుముతూ చెప్పిన హృదయ విదారకమైన దృశ్యం. ఇది ఎక్కడో జరిగింది కాదు.. మహానగరమని, ప్రపంచస్థాయి జీవనమని చెప్పుకునే హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. కోటాను కోట్లు పెట్టి అభివృద్ధికి కాణాచిగా నిలిపామని పాలకులు చెప్పుకుంటున్న భాగ్యనగరంలో అదే పాలకులు సృష్టించిన బతుకు దయనీయ పరిస్థితికి నిలువుటద్దం.
Hyderabad News: ఇది నిన్న డిసెంబర్ 31న హైదరాబాద్ పరిధిలోని ఖాజాగూడ పరిధిలో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ నివాసాలను హైడ్రా అధికారులు, సిబ్బంది కూల్చివేశారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే వారిండ్లను నేలమట్టం చేశారు. కనీసం సామగ్రిని తీసుకోనియ్యకుండా బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఇంట్లో ఉంచిన అన్నంలో మట్టి పడింది. నీళ్లు లేవు. రోడ్డున పడ్డ బతుకులైనవి. ఒకరోజైంది అన్నంతినక. ఉన్న కొద్దిపాటి సామాను వద్ద తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని వెతికినా దొరకక, దిగాలుగా పక్కనే కూర్చొని ఉన్న అమ్మను ఆబాలిక ఇలా సైగతో అడిగిన దయనీయ బతుకు చిత్రం.
Hyderabad News: ఈ దుస్థితికి కారకులు ఎవరైతే ఏమి కానీ, అభం శుభం తెలియని బాలలకు ఏమి సమాధానం చెప్తారు? ఎవరు ఓదార్చుతారు? ఏమని సముదాయిస్తారు? ఆ ఆకలి బాధలు.. ఆ బడా నేతలకు, ఆ బడా అధికారులైన బాబులకు ఏమి తెలుస్తుంది. సాధారణ జీవనానికి అలవాటు పడిన జనానికే ఆ బాధ తెలుస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు.. అధికారులను అడగడం లేదు. కానీ ఈ దయనీయ పరిస్థితికి ఏమని చెప్తారు.
Hyderabad News: ఇలా జరుగుతుందని ముందే గ్రహించలేకపోయారా? ఊహించలేదా? మునుపు ఎవరూ ఇలాంటి దుర్భర పరిస్థితులు కల్పించలేదన్నది జగమెరిగిన సత్యం. నాటి రాజుల కాలంలో కూడా ఇలాంటి దయనీయం కనిపించలేదని, కరుడు కట్టిన నియంతల పాలనలోనూ ఇలాంటి దుర్భర పరిస్థితులు లేవని, అక్కడ కూడా మానవత్వం పరిమళించిందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏ పాలన నడుస్తుంది. ఎందుకిలా ఉంటుంది.. ఎవరు దీనికి బాధ్యులు. హైడ్రా చర్యలపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా పాలకుల్లో మార్పు రాకపోవడం శోచనీయం.