Hit And Run

Hit And Run: కారుతో ఢీకొట్టి ప్రముఖ న్యాయవాది హత్య.. భూవివాదమే కారణమా?

Hit And Run: హైదరాబాద్ నగరంలోని మాసబ్ ట్యాంక్ పరిధిలో కలకలం రేపిన కారు దాడి ఘటన విషాదాంతమైంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది (అడ్వకేట్) ఖాజా మొయిజుద్దీన్.. చికిత్స పొందుతూ ఈరోజు (మే 23) తుది శ్వాస విడిచారు. మొదట దీనిని ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసుల ప్రాథమిక విచారణలో ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది.

అసలు ఏం జరిగిందంటే..?

మే 23వ తేదీ శనివారం ఉదయం న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అయితే, అప్పటికే ఆయన కోసం అక్కడ పొంచి ఉన్న దుండగులు.. మొయిజుద్దీన్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా కారుతో వేగంగా ఢీకొట్టారు. ఆయనను తీవ్రంగా గాయపరిచి, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసి అక్కడి నుంచి కారుతో సహా పరారయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. తొలుత ఈ ఘటనను ‘హిట్ అండ్ రన్’ కేసుగా నమోదు చేసినప్పటికీ.. లాయర్ మృతి చెందడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా మార్చి దర్యాప్తును ముమ్మరం చేశారు.

హత్య వెనుక వక్ఫ్ ఆస్తుల వివాదం?

ఈ హత్య వెనుక భారీ భూవివాదాలు ఉన్నట్లు గట్టిగా అనుమానిస్తున్నారు. వక్ఫ్ ఆస్తులు ఇంకా భూమి వ్యవహారాలకు సంబంధించి ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌ అనే వ్యక్తులతో న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌కు గత కొంతకాలంగా తీవ్రమైన వివాదాలు నడుస్తున్నాయి.

బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. గతంలో కూడా ఈ ఇద్దరు నిందితులు (ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్) ఖాజా మొయిజుద్దీన్‌కు హాని తలపెట్టడానికి, బెదిరించడానికి ప్రయత్నించారని.. దీనిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో రాతపూర్వకంగా ఫిర్యాదులు కూడా నమోదయ్యాయని బాధితుడి కుటుంబ సభ్యులు, సహచర న్యాయవాదులు వెల్లడించారు.

పాత కక్షలు, భూవివాదాల మనసులో పెట్టుకునే పక్కా స్కెచ్‌తో కారుతో తొక్కించి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *