Harish Rao

Harish Rao: సీఎం రేవంత్‌కు హరీశ్ రావు ఊహించని సవాల్!

Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శరపరంపరగా సవాళ్లు విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి పదేపదే కేసీఆర్ పేరు ఎత్తుతున్నారని, ఆయనతో మాట్లాడటానికి రేవంత్‌కు కేసీఆర్ అవసరం లేదని.. తానే సరిపోతానని వ్యాఖ్యానించారు. చేతకాకపోతే కేవలం మూడు నెలల పాటు తనకు ఇరిగేషన్ (జలవనరుల) శాఖ బాధ్యతలను అప్పగించాలని, ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఎలా తేవచ్చో తానే స్వయంగా చేసి చూపిస్తానని హరీశ్ రావు సవాల్ చేశారు.

నదులలో నీళ్లు పుష్కలంగా ప్రవహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు నడపకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు. నీళ్లుండి కూడా మోటార్లు ఆన్ చేయనందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉరివేసినా తప్పులేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎల్‌నినో వల్ల వర్షాలు లేవు, నీళ్లు లేవు, మోటార్లు ఎక్కడ ఆన్ చేయాలి?” అని రేవంత్ రెడ్డి అంటున్నారని.. కానీ ఈ క్షణానికి మేడిగడ్డ వద్ద 89,230 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని ఆధారాలు చూపించారు. వాన పడ్డా, పడకున్నా అక్కడ నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు కట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కోసం నీళ్లను వాడుకోకుండా, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి నీళ్లను వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాగా కేసీఆర్ అన్నీ సిద్ధం చేసి ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేక విఫలమైందని దుయ్యబట్టారు.

తమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే రేవంత్ రెడ్డి వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ ఆధారాలు చూపిస్తే తాను వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ ఆ అనుమతి కాగితాలు లేకపోతే, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడానని ఒప్పుకుంటూ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తెలివి తక్కువగా, అబద్ధాలు మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ అంటేనే కరెక్షన్, కరప్షన్ (అవినీతి) అని హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *