Vijayasai Reddy

Vijayasai Reddy: హిందూమతంపై విషం చిమ్మితే ఉరిశిక్ష వేయాలి.. ప్రకాష్ రాజ్, జోసెఫ్ రావణ్‌లపై విజయసాయి రెడ్డి ఫైర్..

Vijayasai Reddy: యూట్యూబర్ జోసెఫ్ రావణ్ మరియు సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు వీరిద్దరికీ తెర వెనుక ఉండి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడ ఉన్నాయి? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మన సనాతన ధర్మం, దేశ సంస్కృతిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వారికి చట్టంతో పాటు సమాజం కూడా బుద్ధి చెప్పాలని ఆయన హెచ్చరించారు.

హిందూ మతంపై, మన దేవతలపై తప్పుడు వ్యాఖ్యలు చేసే వారికి యావజ్జీవ కారాగార శిక్ష (లైఫ్ ఇంప్రెజన్‌మెంట్) లేదా ఉరిశిక్ష వేసినా తప్పులేదని విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే దీనికోసం ప్రభుత్వం చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. కోట్ వేసుకుని, మైక్ పట్టుకుని వచ్చిరాని ఇంగ్లీష్, తెలుగులో హిందూ సంస్కృతిపై విషం చిమ్మడం కొందరికి ఫ్యాషన్, హీరోయిజంగా మారిందని విమర్శించారు. మతం మారిన కొన్ని ఓసీ కులాల కుటుంబాలు.. తెర వెనుక ఉండి ఇతర వర్గాల వారితో మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా పథకం ప్రకారం విషం కక్కిస్తున్నాయని ధ్వజమెత్తారు.

వైసీపీ పార్టీ నేరుగా రావణ్‌ను, ప్రకాష్ రాజ్‌ను సమర్థించడాన్ని విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. వారిని వెనకేసుకుని రావడం అంటే నేరుగా మన హిందుత్వంపై, దేశ సార్వభౌమాధికారంపై చేస్తున్న దాడిగానే పరిగణించాలని అన్నారు. ఇలాంటి ఆలోచనలను మతపరమైన ఉగ్రవాదంగా చూడాలని, సమాజం వీరిని పూర్తిగా వెలివేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశద్రోహ, సంఘ విద్రోహ కుట్రలపై అటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *