Kishan Reddy: సుప్రీంకోర్టు జడ్జిలనే బెదిరిస్తారా?.. హైదరాబాద్‌లో మాకు పర్మిషన్ ఇవ్వరు.. ఢిల్లీలో నీతులు చెబుతారా?

Kishan Reddy: దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం (EC), సుప్రీంకోర్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు చేస్తున్న ఆందోళనలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన స్థాయిని మరిచిపోయి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. అధికారం కోసం దేశంలోని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలకు తెరతీసిందని మంగళవారం మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో స్పీకర్.. ఇప్పుడు సీఈసీ, సీజేఐ రాజీనామా అంటారా?..
రాహుల్ గాంధీ వైఖరిని ఎండగడుతూ కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు..  కాంగ్రెస్ పార్టీ తీరు విచిత్రంగా మారింది. గతంలో లోక్‌సభ స్పీకర్ రాజీనామా చేయాలన్నారు.. ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తప్పుకోవాలని రచ్చ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దేశానికి ద్రోహం చేస్తున్నారంటూ విషం చిమ్ముతున్నారు. చివరకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కూడా గద్దె దిగాలనే స్థాయికి దిగజారడం అత్యంత శోచనీయం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయమూర్తులపై ఒత్తిడి తెచ్చే యత్నం..
వేలాది మందిని సుప్రీంకోర్టు వద్దకు తరలించి, న్యాయమూర్తులపై మానసిక ఒత్తిడి తెస్తూ వ్యవస్థలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవడం చేతగాక రాజ్యాంగ సంస్థలపైనే దండయాత్ర చేస్తారా? కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేయకపోతే అది ప్రజల తప్పా? 60 ఏళ్లు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన పార్టీ మానసిక స్థితి ఇలా దిగజారడం దురదృష్టకరం అని మండిపడ్డారు.
200 మంది అధికారులా?.. ఎవరిని బెదిరిస్తున్నారు?..
మోదీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు తమ టచ్‌లో ఉన్నారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.. ప్రధాని పదవి నుంచి మోదీ దిగిపోవాలని 200 మంది సీనియర్ అధికారులు కోరుకుంటున్నారని రాహుల్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ 200 మంది పేర్లతో ఎవరిని బెదిరించాలని చూస్తున్నారు? భారతదేశం చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది తప్ప కాంగ్రెస్ మార్కు నియంతృత్వంతో నడవదు” అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ బీఎల్‌ఏలు ఏం చేస్తున్నారు?..
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో తప్పులు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. వాటిని సరిదిద్దే బాధ్యతను ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్‌లో ఏవైనా తప్పిదాలు ఉంటే ఆధారాలు చూపి సరిదిద్దాల్సింది పోయి రోడ్లపై రాద్ధాంతం చేయడం ఎందుకు? బూత్ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) అసలు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు.
రాహుల్ గజం ఎగిరితే.. రేవంత్ రెండు గజాలు ఎగురుతున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీరును కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.. హైదరాబాద్‌లో ప్రజా సమస్యలపై బీజేపీ ఏదైనా ధర్నా చేయాలని భావిస్తే మా నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తారు. హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప తెలంగాణలో ధర్నా చేసుకోలేని దుస్థితి ఉంది. స్వరాష్ట్రంలో కనీసం ధర్నాకు పర్మిషన్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీకి వెళ్లి నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదంటూ నీతులు చెబుతుండటం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ గజం ఎగిరితే.. ఆయన మెప్పు కోసం రేవంత్ రెడ్డి రెండు గజాలు ఎగురుతున్నారు. పాలనను గాలికొదిలేసి వారానికి ఒకసారి ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీపై నోటికొచ్చిన ఆరోపణలు చేయడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారు అని విమర్శించారు.
జంతర్ మంతర్ మార్పు ప్రజల కోసమే..
నిరంతరం జరిగే ఆందోళనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఢిల్లీ ప్రజలు భయపడుతున్నారని, స్థానిక వ్యాపారులు, పౌరుల విజ్ఞప్తుల మేరకే జంతర్ మంతర్ నుంచి నిరసన వేదికలను తరలించారని కిషన్ రెడ్డి సమర్థించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో బాబు జగ్జీవన్ రామ్, ఎన్టీఆర్, డాక్టర్ మన్మోహన్ సింగ్‌లను ఏ విధంగా అవమానించిందో ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆయన చురకలంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *