Hombale Films: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మూడు సినిమాల ఒప్పందాన్ని కుదుర్చకుంది. అందులో ఒకటి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే… ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చలేదా? లేకపోతే అతని వైఖరే నచ్చలేదేమో తెలియదు కానీ వారు ప్రభాస్ తో నిర్మించే సినిమాల్లో ప్రశాంత వర్మ మూవీ లేదని సమాచారం. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్శ్ ద్వారా అగ్ర కథానాయకులు, అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం ‘జై హనుమాన్’ ను మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా చేస్తున్నాడు. అలానే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతోనూ సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే… ఇటీవల విడుదలైన ‘దేవకి తనయ వాసుదేవ’ మూవీ పరాజయం పాలు కావడం ప్రశాంత్ వర్మకు కాస్తంత ఇబ్బందినే తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు ప్రశాంత్ వర్మే కథను అందించాడు.
