Pawan Kalyan: రాష్ట్రంలో లాభాలు సంపాదిస్తున్న పెద్ద పెద్ద పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలు గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ అధికారులతో కలిసి గ్రామాలకు రావాల్సిన పన్నుల వసూళ్లపై ఆయన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని నీరు, భూమి లాంటి వనరులను వాడుకుంటూ, కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్న పరిశ్రమలు పన్నులు కట్టకుండా బకాయిలు పెట్టడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.
ముఖ్యంగా ప్రముఖ పరిశ్రమ అయిన ‘ఆంధ్రా పేపర్ మిల్స్’ ఒక్కటే దాదాపు 19 కోట్ల రూపాయల పన్ను బకాయిలు పెట్టడంపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. కేవలం పరిశ్రమలే కాకుండా, పెద్ద పెద్ద ప్రైవేటు విద్యాసంస్థలు కూడా పంచాయతీలకు భారీగా పన్నులు కట్టకుండా పెండింగ్‌లో పెట్టాయని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నులు గనుక కరెక్ట్‌గా వసూలైతే ప్రభుత్వానికి 5,400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా ఆయన లెక్కలతో సహా వివరించారు.
గ్రామాల్లో ఉండే పేద ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, కులవృత్తుల వారు కూడా రూపాయి రూపాయి కూడబెట్టి పన్నులు సకాలంలో చెల్లిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ, ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు ఎగ్గొడుతున్న విషయం సామాన్య ప్రజలకు తెలియదని ఆయన చెప్పారు. పన్నుల వసూలు విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వేయవద్దని, నిబంధనల ప్రకారం కచ్చితంగా వసూలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ పన్నుల బకాయిల సమస్యపై తాను ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో కూడా మాట్లాడి పూర్తి మద్దతు తీసుకుంటానని అధికారులకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. గతంలో జరిగిన ‘పల్స్ సర్వే’ లాగా ఇప్పుడు ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న పన్నులన్నింటినీ వసూలు చేయడానికి ఒక బలమైన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
