Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణం విచిత్రంగా మారింది. ఎల్నినో ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతుంటే.. అదే సమయంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనాలకు వాతావరణ శాఖ ఒక ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల ఎండల తీవ్రత కొద్దిగా తగ్గుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరోవైపు, నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించిన అప్డేట్ను కూడా అధికారులు అందించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ రుతుపవనాలు కేరళ, తమిళనాడుతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తెలంగాణ వాతావరణం ఎలా ఉండబోతోంది?
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఈరోజు ఎండ తీవ్రత ఇలాగే ఉన్నప్పటికీ.. రేపటి నుండి నాలుగు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల వేడి నుండి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల హెచ్చరిక!
అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజులు వాతావరణం చాలా అస్థిరంగా ఉండనుంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
ఇక బుధవారం నాడు కూడా వర్షాలు కొనసాగుతాయని, అయితే గాలుల వేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్లకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో ఏపీవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెద్దగా పెరగకుండా, 2 నుండి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రయాణాలు చేసే వారు, రైతులు వాతావరణ మార్పులను గమనించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
