Ice Gola: వేసవి సెలవులు రాగానే.. లేదా స్కూల్ గంట మోగగానే గేటు బయట ఐస్ బండి వైపు పరుగులు తీయడం.. చేతిలో ఐస్ పుల్ల పట్టుకుని, దానిపై నల్లగా, పుల్లగా ఉండే సిరప్ వేయించుకుని ‘చుస్కి’ (చల్లటి ఐస్ గోలా) లాగుతూ నాలుకను రంగురంగులుగా మార్చుకోవడం.. ఈ సీన్ గుర్తురాగానే మనలో చాలామందికి తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలు కళ్లముందు కదలాడతాయి!
తరతరాలుగా మనందరి ఫేవరెట్ దేశీ డ్రింక్‌గా మారిపోయిన ఈ ఐస్ గోలా, అందులోనూ ప్రత్యేకమైన ‘కాలా ఖట్టా’ (Kala Khatta) గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అసలు ఈ ఐస్ గోలా ఎప్పుడు పుట్టింది? దీనిని మొదటిసారి కనిపెట్టింది ఎవరు? అసలు ‘కాలా ఖట్టా’ అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు!
మనది కాదు.. ఇది 1000 ఏళ్ల నాటి జపనీస్ ఆవిష్కరణ!..
‘కాలా ఖట్టా’, ‘ఐస్ గోలా’ అనగానే అచ్చమైన ఇండియన్ ఐటమ్ అని మనం ఫిక్స్ అయిపోతాం. కానీ వాస్తవానికి దీని మూలాలు ఉన్నది జపాన్ దేశంలో!
హెయాన్ కాలంలో పుట్టుక (సా.శ. 794–1185)..
సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం జపాన్‌లోని ప్రాచీన ‘హెయాన్’ (Heian) కాలంలో దీనిని మొదటిసారి తయారు చేశారు. జపనీస్ భాషలో దీనిని ‘కాకిగోరి’ (Kakigori) అని పిలిచేవారు. అంటే సన్నగా గీకిన మంచు తురుము (Shaved Ice Treat) అన్నమాట.
కొండల నుంచి మంచు తెచ్చి దాచేవారు..
ఆ కాలంలో ఫ్రిడ్జ్‌లు ఉండేవి కావు కాబట్టి.. శీతాకాలంలో ఎత్తయిన పర్వతాల నుంచి సహజసిద్ధమైన మంచును తెచ్చి, అది కరిగిపోకుండా భూగర్భంలో నిర్మించిన ‘ఐస్ హౌస్‌ల’లో ప్రత్యేకంగా భద్రపరిచేవారు. వేసవి రాగానే ఆ మంచును తురిమి, దానిపై మాచా (గ్రీన్ టీ), స్ట్రాబెర్రీ, చెర్రీ లేదా పుచ్చకాయల రసాన్ని పోసుకుని జపాన్ రాజవంశీకులు, ప్రజలు ఎంతో ఇష్టంగా తినేవారు.
జపాన్ నుంచి హవాయి.. అక్కడి నుంచి ఇండియాకు!
జపాన్‌లో ప్రారంభమైన ఈ మంచు ట్రీట్ క్రమంగా ప్రపంచ పర్యటన చేసింది..1900ల ప్రారంభంలో జపాన్ నుంచి ప్రజలు ఉపాధి కోసం అమెరికాకు చెందిన హవాయి దీవులకు వలస వెళ్లినప్పుడు ఈ ‘కాకిగోరి’ సంస్కృతిని వెంట తీసుకెళ్లారు. అక్కడ ఇది ‘హవాయియన్ షేవ్డ్ ఐస్’గా ప్రాచుర్యం పొందింది.
అదే కాలంలో వర్తకులు, ప్రయాణికుల ద్వారా ఈ షేవ్డ్ ఐస్ కాన్సెప్ట్ భారతదేశానికి చేరుకుంది. మన భారతీయులు ఊరుకుంటారా? దానికి మనదైన దేశీ మసాలాలు, పులుపు, తీపి రుచులు జోడించి మన సొంత బ్రాండ్‌గా మార్చేశారు. అలా గల్లీ గల్లీలో తోపుడు బండ్లు, జాతరలు, మార్కెట్లు, బీచ్‌లలో నిలబడి ఐస్ గోలా తినడం ఒక సంస్కృతిగా మారిపోయింది.
‘కాలా ఖట్టా’ అనే పేరు ఎలా వచ్చింది?
ఐస్ గోలాలో వంద రకాల రుచులు ఉన్నా.. ‘కాలా ఖట్టా’ స్థానమే వేరు. ఈ పేరు వెనుక ఓ రుచికరమైన కారణం ఉంది.
ముదురు రంగు & తియ్యటి పులుపు..
హిందీలో ‘కాలా’ అంటే నలుపు (ముదురు నీలం లేదా వంకాయ రంగు), ‘ఖట్టా’ అంటే పులుపు. ఈ సిరప్ ముదురు రంగులో ఉంటూ పుల్లపుల్లగా, తియ్యగా నాలుకకు తగలడం వల్ల దీనికి ‘కాలా ఖట్టా’ అనే పేరు స్థిరపడిపోయింది.
ఒరిజినల్ రెసిపీ ఏంటి?:
పాత రోజుల్లో కాలా ఖట్టా సిరప్‌ను అచ్చమైన నేరేడు పండ్ల రసం (Jamun pulp)తో సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసేవారు. ఆ తర్వాత కాలంలో నల్ల ద్రాక్ష, నిమ్మరసం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్), చక్కెర పాకం కలపి ఈ సిరప్‌ను మరింత ఘాటుగా మార్చారు.
కాలంతో పాటు మారిన ఐస్ గోలా రుచులు..
నేడు కాలా ఖట్టా కేవలం నేరేడు లేదా ద్రాక్ష రసానికే పరిమితం కాలేదు. ఆధునిక కాలంలో వీధి వ్యాపారులు ఇందులో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు..
-
పచ్చి మామిడి (కచ్చా ఆమ్)
-
బ్లాక్కరెంట్
-
నిమ్మ-పుదీనా
-
చింతపండు ఫ్లేవర్ (ఇమ్లీ)
-
పైనాపిల్
-
రోజ్, రూహ్ అఫ్జా వంటి ఎన్నో ఫ్లేవర్లలో ఐస్ గోలాలు అందుబాటులోకి వచ్చాయి.
జపాన్‌లో కొండ మంచుతో ‘కాకిగోరి’గా మొదలైన ప్రయాణం.. చివరకు మన వీధుల్లో మసాలా నల్ల ఉప్పు జల్లిన ‘కాలా ఖట్టా’గా మారి కోట్లాది మంది చిన్ననాటి తీపి జ్ఞాపకంగా నిలిచిపోవడం నిజంగా ఒక గ్రేట్ జర్నీ కదూ!
