Rameshwaram : తమిళనాడులోని రామేశ్వరం పుణ్యక్షేత్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆలయ సందర్శనకు వెళ్లిన ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. అగ్నితీర్థం సముద్రతీరంలో ఉన్న దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరా కనుగొనబడింది.
పుదుకోట్టైకి చెందిన మహిళ కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం ఆలయ దర్శనానికి వెళ్లింది. ఆలయ ఆచారాలకు అనుగుణంగా అగ్నితీర్థం సముద్రస్నానం ఆచరించిన ఆమె, దుస్తులు మార్చుకునేందుకు తీరం వద్ద ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లింది. అక్కడ ఆమె రహస్యంగా అమర్చిన కెమెరాను గమనించి షాక్‌కు గురైంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు, ఆలయ అధికారులకు తెలియజేశారు.
పోలీసులు, ఆలయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గదిలో అమర్చిన రహస్య కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. బూత్ నిర్వాహకుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా, రాజేష్‌కు సహకరించినటువంటి టీస్టాల్ నిర్వాహకుడు మీరా మొయిదీన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన భక్తులలో ఆందోళనకు కారణమైంది. భక్తులు తమ గోప్యతకు ప్రమాదం కలిగే పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరికగా నిలుస్తోంది.