Kaleshwaram Report: తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చుట్టూ రాజకీయ, న్యాయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, ఇవాళ చీఫ్ జస్టిస్ ధర్మాసనం రెండు పిటిషన్లను కలిపి విచారణ చేపట్టింది.
పిటిషనర్ల వాదనలు
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కేసీఆర్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ, నోటీసు ఇవ్వకుండానే ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా రిపోర్టు ఇచ్చారు అని ఆక్షేపించారు. ఇదే సమయంలో, హరీశ్‌రావ్ తరఫు లాయర్ మాట్లాడుతూ, తమ క్లయింట్‌ను సాక్షిగా పిలవకుండానే రిపోర్ట్‌లో పేర్లు లాగడం అన్యాయం అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నివేదిక కాపీని లభ్యం చేయాలని లేఖ రాసినా ఇప్పటికీ ఇవ్వలేదని వాదించారు. అంతేకాకుండా, ప్రస్తుత ముఖ్యమంత్రి స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి నివేదికను ప్రజలకు వెల్లడించారని పేర్కొన్నారు.
కోర్టు సూచనలు
వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, తమకు అందిన నివేదిక కాపీలు సక్రమంగా లేవని స్పష్టం చేసింది. స్పష్టంగా చదవగలిగే కాపీలు సమర్పించాలి అని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Tejasvi yadav: కేంద్ర బిల్లుపై దేశవ్యాప్తంగా దుమారం – తేజస్వి సంచలన ఆరోపణలు
ప్రభుత్వ తరఫు వాదనలు
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఘోష్ కమిషన్ నివేదిక ప్రస్తుతం పబ్లిక్ డొమైన్లో లేదని, ముందుగా అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉందని వివరించారు. అసెంబ్లీలో చర్చ తర్వాతే నివేదికను ప్రజల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. కౌంటర్ అఫిడవిట్లో మరిన్ని వివరాలు సమర్పిస్తామని తెలిపారు.
హైకోర్టు ప్రశ్న
ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నిస్తూ – కమిషన్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకుంటారా? లేక అసెంబ్లీ చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటారా? అని అడిగింది. దీనిపై సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో విచారణను రేపటికి (ఆగస్టు 22) వాయిదా వేసింది.
రాజకీయ ఉత్కంఠ
ఒకవైపు ప్రభుత్వం అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు కేసీఆర్, హరీశ్‌రావ్ కోర్టు ఆశ్రయించడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా? లేక నివేదికపై అసెంబ్లీ చర్చ అనంతరం మాత్రమే నిర్ణయం తీసుకుంటుందా? అన్న ఉత్కంఠ పెరిగింది.
