Malayalam Actress: మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు తరచూ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత పలువురు మహిళలు తమ అనుభవాలను ధైర్యంగా బయట పెడుతుండగా, తాజాగా కేరళలో మరో సంచలనం రేగింది. నటి, మాజీ జర్నలిస్టు రిని ఆన్ జార్జ్ (Rini Ann George) ఓ యువ కాంగ్రెస్ నేతపై చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో రిని ఆన్ జార్జ్ మాట్లాడుతూ—ఓ యువ రాజకీయ నాయకుడు ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేశానని, అక్కడికి రమ్మంటూ అసభ్యకర సందేశాలు పంపాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ నేత పేరు, పార్టీ వివరాలు మాత్రం ఆమె వెల్లడించలేదు.
కానీ ఈ ఆరోపణలపై బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నది యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ (Rahul Mamkootathil) అని ప్రకటిస్తూ, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో పాలక్కాడ్‌లోని ఆయన కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Kaleshwaram Report: కాళేశ్వరం రిపోర్ట్‌పై హైకోర్టులో విచారణ.. రేపటికి వాయిదా
ఇక ఈ వివాదం సద్దుమణియక ముందే మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. రచయిత్రి హనీ భాస్కరన్ కూడా రాహుల్ మమ్‌కూటథిల్‌పై ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియా ద్వారా గతంలో తనను కూడా వేధించాడని తెలిపారు. దీంతో కేసు మరింత ముదిరింది.
ఒకరి తర్వాత ఒకరు మహిళలు ఆయనపై ఆరోపణలు చేస్తుండటంతో, రాహుల్ వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి చేరింది. పార్టీ లోపలే కొందరు మహిళా నేతలను కూడా ఆయన ఇబ్బంది పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పార్టీ శ్రేణులు ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని భావిస్తున్నాయి.
కాంగ్రెస్ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోయినా, రాహుల్ మమ్‌కూటథిల్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, బీజేపీ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా తీవ్రంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది.
