HBD Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ .. తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గాడ్ ఆఫ్ మాసెస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయన 50 సంవత్సరాల నట ప్రస్థానం, మూడు దశాబ్దాల రాజకీయ జీవితానికి మరో గొప్ప గుర్తింపు జతైంది. ఈ సారి ఆయన పుట్టినరోజు వేళ, అభిమానులు ఆయనను “పద్మభూషణ్ బాలయ్య” అని గర్వంగా పిలుచుకుంటున్నారు.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కల్పించిన పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణకు గౌరవాన్ని కాదు, గళాన్ని ఇచ్చింది. అభిమానులు మాత్రం ఈ ఘనతను తెలుగు సినీ పరిశ్రమకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు.
అఖండుడి తిరిగొచ్చే దండయాత్ర: అఖండ 2 తాండవం
పుట్టినరోజు కానుకగా ‘అఖండ 2’ తాండవం టీజర్‌ను విడుదల చేసిన బాలయ్య, అభిమానుల్లో గూస్‌బంప్స్ పుట్టించేలా చేశారు. టీజర్ లోని పవర్‌పుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి బాలయ్య స్టామినా ఏమిటో గుర్తు చేసింది. ఈ చిత్రం ద్వారా 19వ సారి ద్విపాత్రాభినయం చేయనున్న బాలయ్య, మరో రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు.
14వ యేట నటుడిగా, 65వ ఏట అపార గౌరవంతో!
1960 జూన్ 10న ఎన్టీఆర్-బసవతారకం దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించిన బాలయ్య, కేవలం 14 ఏళ్ల వయస్సులో ‘తాతమ్మ కల’ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇవాళ వరకు 100కి పైగా సినిమాల్లో నటించారు. ‘మంగమ్మగారి మనవడు’, ‘సమరసింహా రెడ్డి’, ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు.
అంతేకాదు, ఒకేరోజు రెండు చిత్రాలు (‘నిప్పురవ్వ’, ‘బంగారు బుల్లోడు’) విడుదల చేసి రెండు చిత్రాలూ వంద రోజులు జరుపుకోవడం వంటి అరుదైన ఫీట్‌ను సాధించారు.
సినిమా, రాజకీయాలు, సేవా రంగంలో మూడింటికీ నెగిలిన పేరు
తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురం నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజలకు నిస్వార్థ సేవ అందిస్తున్నారు. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా దాదాపు రెండు దశాబ్దాలుగా బాధితులకు ఆశగా నిలుస్తున్నారు.
అన్‌స్టాపబుల్ స్టార్, అల్-ఇన్-వన్ ఎంటర్టైనర్
డైలాగ్ డెలివరీ, డాన్స్, ఫైట్లు, హాస్యం, పాటలు పాడడం వంటి ప్రతిభలు బాలకృష్ణను ఒక అల్-ఇన్-వన్ ఎంటర్టైనర్‌గా నిలబెట్టాయి. ‘అన్‌స్టాపబుల్’ షో ద్వారా టాక్ షో హోస్ట్‌గా కూడా సత్తా చాటారు. ఏ వయసులోనూ ఎనర్జీ తగ్గక, ప్రతి రంగంలో తన ముద్ర వేస్తున్న బాలయ్య — ఈనాటి తరం హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
వీర్ బాలయ్యకు జయహో!
తెలుగు చిత్ర పరిశ్రమను సర్వజన హితాయంగా దిద్దిన ఎన్టీఆర్ వారసుడిగా, నటనలో తనదైన ముద్ర వేసిన నట సింహంగా, ప్రజాసేవలో నిబద్ధత చూపిన నాయకునిగా — బాలకృష్ణ ఒక పాఠం, ఒక పురాణం. ఈ రోజు 65వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.