Bihar: నకిలీ పోలీస్ స్టేషన్ తెరిచి దందాలకు పాల్పడుతుండటాన్ని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ, ఇక్కడ ఏకంగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌నే తెరిచాడు. పోలీసుల పేరిట యువకులను నియమించాడు.. వారికి ఖాకీ డ్రెస్సులు తగిలించేశాడు.. అక్రమ వసూళ్లకు తెరలేపాడు.. ఈ దందా ఒకటి రెండు నెలల నుంచే జరగడం లేదు.. ఏకంగా ఏడాది కాలంగా బీహార్ రాష్ట్రంలోని ఓ చోట యథేచ్ఛగా కొనసాగుతున్నది.
Bihar: బీహార్ రాష్ట్రంలోని పూర్ణిమా జిల్లా మోహిని గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ షా అనే వ్యక్తికి ఓ ఆలోచన తట్టింది. తానే ఓ పోలీస్ స్టేషన్ నడిపితే పోలే అని అనుకున్నదే తడవుగా అదే గ్రామంలో పోలీస్ స్టేషన్ పేరిట నకిలీ స్టేషన్‌ను తెరిచాడు. నిరుద్యోగులైన యువకులను చేరదీశాడు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.2,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేశాడు. వారికి పోలీస్ యూనిఫాం, లాఠీలు, నకిలీ ఐడీ కార్డులు చేయించి ఇచ్చాడు.
Bihar: ఇక ఇక్కడే రాహుల్ కుమార్ షా ఆట మొదలుపెట్టాడు. తాను నియమించుకున్న నకిలీ పోలీసులతో పెట్రోలింగ్ చేయించేవాడు. పెట్రోలింగ్ కోసం సీఎన్‌జీ ఆటోను ఉపయోగించేవారు. దానిని నితేశ్ కుమార్ ఒరాన్ అనే వ్యక్తి పోలీస్ దుస్తులు వేసుకొని నడిపేవాడు. మద్యం అక్రమ రవాణాపై దాడులు చేయించి అక్రమ వసూళ్లకు పాల్పడేవారు. వారి నుంచి వసూలు చేసిన డబ్బుల్లో సగం నకిలీ పోలీసులకు ఇచ్చి, మిగతా సగం రాహుల్ కుమార్ తీసుకునేవాడు.
Bihar: హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి రూ.400 జరిమానా విధించేవారు. ఆ సొమ్ములో సగం తాను ఉంచుకొని, మిగతా సంఘం నకిలీ పోలీసులకు ఇచ్చేవాడు. తాను తీసుకున్న సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తానని వారిని నమ్మబలికేవాడు. ఈ దందా కస్బా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది జరుగుతున్నది. ఈ విషయం తెలియడంతో నిందితులు రాహుల్ కుమార్ షా, నితేశ్ కుమార్ ఒరాన్ తదితరులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏడాదిగా జరుగుతున్నా ఉన్నతాధికారులు తెలుసుకోలేకపోవడంపై ఆ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.