TS Cabinet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13నెలలు అయిన కానీ ఇంకా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి మంత్రి పదవుల భర్తీ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. 6 మంత్రి పదవుల ఖాళీలకు పదుల సంఖ్యలో ఆశావహులు ఉండడంతో అధిష్ఠానం వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పేర్ల ప్రతిపాదన… అభిప్రాయం చెప్పేవరకు మాత్రమే కాంగ్రెస్ నేతల పాత్ర అని…
ఎవరికి బెర్త్ కన్ఫర్మ్ అనేది అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని పార్టీ హైకమాండ్ నేతలకు తేల్చి చెప్పినట్లు సమాచారం.
ఢిల్లీలో ఏఐసీసీ కార్యనిర్వహక ప్రధాన కార్యదర్శి కేసి వేణు గోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత విషయాలతో పాటు ప్రభుత్వ ఏడాది పాలనపై చర్చించినట్లు సమాచారం. ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరుపై అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటున్న ఆ క్యాబినెట్ మంత్రులకు హైకమాండ్ ఉద్వాసన
పలుకుతుందా అనే స్థాయిలో సీరియస్‌గా ఉందని అధికార పార్టీ సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
క్యాబినెట్ బెర్త్ కోసం సీనియర్ నేతలు తమ సన్నిహితుల పేర్లు హైకమాండ్ ముందు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమారు 12 నుంచి 14 మంది పేర్ల వరకు కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.
TS Cabinet: అయితే మంత్రివర్గంలో మరో 6 స్థానాలకు అవకాశం ఉండగా.. ప్రధానంగా 10 మంది నేతల పేర్లు అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. క్యాబినెట్ విస్తరణ అనే అంశం వచ్చినప్పుడల్లా… ఈ 10 మంది నాయకుల పేర్లు చర్చకు వస్తున్నాయి. అయితే… ఇప్పటికే ఉన్న క్యాబినెట్‌లో.. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో… ఆ ప్రాంతాల నాయకులకు ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు క్యాబినెట్ విస్తరణలో మైనారిటీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు యువతకు కూడా అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఓ స్థానాన్ని కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు. అయితే క్యాబినెట్ విస్తరణతో పాటు కొన్ని ప్రముఖ శాఖల్లో మార్పు కూడా ఉండనుందని తెలుస్తోంది.
అధిష్టానానికి విశ్వసనీయతతో మెదిలే ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొన్ని పేర్లు ప్రతిపాదించి వారికి ఖచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్ చేయాలని వారి స్థాయిలో పర్సనల్ రిక్వెస్ట్ చేశారని టాక్ నడుస్తోంది. అయితే ఆశావహుల జాబితా చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, వినోద్ సోదరుల పేర్లు వినిపిస్తుండగా…
నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మహబూబ్‌నగర్ నుంచి వాకిటి శ్రీహరి పేర్లు చర్చకు వస్తుండగా… ఎస్టీ కోటాలో బాలు నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక.. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి వర్గంలో కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుండగా… ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈసారి రాజగోపాల్ రెడ్డికి ఓ బెర్తు కన్ఫామ్ అని చర్చ సాగుతోంది.
TS Cabinet: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి వర్గంలో గడ్డం వివేక్, వినోద్ బ్రదర్స్… కోమటిరెడ్డి సోదరులకు రెండు రెండు బెర్తులు ఇస్తారా.. ఇస్తే పార్టీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అగ్రనేతల విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు… నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఓ మైనార్టీ నేతకు, రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టు పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని అదే జిల్లాకు చెందిన సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం.
క్యాబినెట్ బెర్త్ కోసం ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులకు ఎప్పటిలాగే ఎదురుచూపా… లేక పదవులు వరిస్తాయో చూడాలి మరి… సీఎం రేవంత్ రెడ్డి తన జట్టులోకి మరో ఆరుగురు మంత్రులుగా ఎవరెవరిని సెలెక్ట్ చేయనున్నారు. సీనియర్ మంత్రులతో సయోధ్య కుదిరేనా..? అధిష్ఠానం ఎవరిని ఫైనల్ చేసి ఎవరికి ఛాన్స్ ఇస్తుందనే అంశాలపై సస్పెన్స్కొ నసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరం దీనిపై ఓ క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు.