Bharathi Raja

Bharathi Raja: ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత.. !

Bharathi Raja: భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (85) సోమవారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు   తో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలోనే ఆఖరి శ్వాస విడిచారు.

కొడుకు మరణంతో కోలుకోలేని శోకం

గతేడాది (2024) మార్చిలో భారతీరాజా కుమారుడు మనోజ్ కేవలం 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో (Cardiac Arrest) అకాల మరణం చెందారు. ఆ సమయం నుండి భారతీరాజా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. కుమారుడి అంత్యక్రియల సమయంలో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన భారతీరాజా విజువల్స్ అందరినీ కంటతడి పెట్టించాయి. తన కళ్ల ముందే కొడుకు చనిపోవడాన్ని ఆయన అస్సలు తట్టుకోలేకపోయారు.

ఇటీవల భారతీరాజా సోదరుడు జయరాజ్ పెరియమాయతేవర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొడుకు దూరమైనప్పటి నుండి భారతీరాజా మానసిక స్థితి చాలా దారుణంగా పడిపోయిందని, ఆ కోలుకోలేని నష్టం నుండి ఆయన ఎంతకీ బయటపడలేకపోయారని వెల్లడించారు.

గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో చెన్నై టీ నగర్‌లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అప్పట్లో ఆయన శ్వాసకోశ సమస్యలు (ఆయాసం వంటివి) కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి.

‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శకత్వ శిఖరం) ప్రస్థానం

భారతీరాజా తన కుమారుడు జన్మించిన ఏడాది తర్వాత, అంటే 1977లో ’16 వాయతినిలే’ (16 ఏళ్ల వయసు) అనే సినిమాతో దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఆయన సుదీర్ఘ కెరీర్‌లో కిళకే పోగుమ్ రైల్, సిగప్పు రోజాక్కల్, అలైగల్ ఓయివతిల్లై, కాదల్ ఓవియమ్, మరియు ముదల్ మరియాతై వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారు.

దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన, సినిమా రంగానికి చేసిన అసమాన సేవలకు గానూ తమిళ చిత్ర పరిశ్రమలో ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శకత్వ శిఖరం) అనే విశేష కీర్తిని, బిరుదును సొంతం చేసుకున్నారు.

కేవలం దర్శకత్వమే కాకుండా పలు చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు. మలయాళ స్టార్ మోహన్‌లాల్ సరసన నటించిన ‘తుడరుమ్’ చిత్రంలో ఆయన చివరిగా స్క్రీన్‌పై కనిపించారు. ఇక దర్శకుడిగా ఆయన ఆఖరి వర్క్.. ‘మోడ్రన్ లవ్ చెన్నై’ ఆంథాలజీ సిరీస్‌లోని ‘పరవై కూటిల్ వాళుమ్ మాంగల్’ అనే సెగ్మెంట్.

నటుడిగా ఆఖరి చిత్రం ‘పులవర్’

నటన పరంగా భారతీరాజా నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది, ఇదే నటుడిగా ఆయనకు చివరి సినిమా కానుంది. ఇది కాకుండా ఆయుధ ఎళుతు (తెలుగులో ‘యువ’), పాండియనాడు (‘పల్నాడు’), ఈశ్వరన్, తిరుచిత్రంబలం (‘తిరు’), మరియు గతేడాది సంచలన విజయం సాధించిన విజయ్ సేతుపతి ‘మహారాజా’ వంటి చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భరతీరాజా మృతి పట్ల సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకులు, నటీనటులు తీవ్ర డిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *