Harish Rao: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి ఘటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలులో ములాఖత్ ద్వారా కలుసుకున్న హరీశ్‌రావు.. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. పోలీస్ రిపోర్టులో పట్నం నరేందర్‌రెడ్డికి ఒకేసారి ఫోన్ కాల్ వచ్చిందని తేల్చితే, కాంగ్రెస్ నేతలు మాత్రం 80 సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ప్రతీ విషయంలో అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
రిమాండ్ రిపోర్టులో ఏం రాశారో తనకు తెలియదని నరేందర్‌రెడ్డి చెప్పారని హరీశ్‌రావు తెలిపారు. ఆయనకు చదివే అవకాశం ఇవ్వకుండా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లే ఐదు నిమిషాల ముందు తప్పుడు రిమాండ్ రిపోర్టులో సంతకం చేయించారని నరేందర్‌రెడ్డి తనతో చెప్పారని తెలిపారు. రిమాండ్ రిపోర్టుపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించారని, ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్‌కు తాను చెప్పినట్టు నరేందర్‌రెడ్డి తనతో అన్నారని హరీశ్‌రావు చెప్పారు. కేటీఆర్‌ను కూడా ఈ కేసులో ఇరికేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.