Harish Rao

Harish Rao: ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలా?

Harish Rao: తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సమస్యలను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్త సమస్యలను సృష్టించి సామాన్య ప్రజల జీవితాలను గందరగోళంలోకి నెట్టేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గం వాజ్‌పేయినగర్‌లో 22A సమస్యతో ఇబ్బందులు పడుతున్న బాధితులతో ఆయన నేరుగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన నిరసన సభలో పాల్గొని మాట్లాడారు.
కాలనీలకు కాలనీలను నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలేం కావాలి?
హరీశ్ రావు ప్రసంగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
  • ప్రజల గోడు: రాత్రికి రాత్రే ఏళ్ల తరబడి నివసిస్తున్న కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేరిస్తే అమాయక ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వం చేసిన తప్పులకు సామాన్యులు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలా? అని నిలదీశారు.
  • మంత్రి రాజీనామా డిమాండ్: ఈ తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
  • టోల్‌ఫ్రీ నంబర్ పని చేయడం లేదు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ కూడా పనిచేయడం లేదని, దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పడం కాకుండా ప్రభుత్వం ఎలాగైతే జాబితాలో పెట్టిందో అలాగే స్వయంగా వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.

20 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు తెచ్చారు?

2008లోనే నాటి ప్రభుత్వం ULC ని రద్దు చేసిందని, ఆ తర్వాత అవి పట్టా భూములుగా మారి లక్షలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారని గుర్తుచేశారు..
  1. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వేల ఎకరాలు: రంగారెడ్డిలో 7,500 జీవోల ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్‌లో 6,000కు పైగా భూములతో పాటు HMDA, HUDA భూములను కూడా వివాదాల్లోకి నెట్టారని ఆరోపించారు.
  2. అసెంబ్లీ వేదికగా పోరాటం: వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారిని చట్టపరంగా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో బాధితులకు అండగా అసెంబ్లీలో గళమెత్తుతామని భరోసా ఇచ్చారు.

కల్యాణలక్ష్మి కాస్తా సంతానలక్ష్మిగా మారింది!

సంక్షేమ పథకాల అమలులోనూ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు విమర్శించారు:
“కేసీఆర్ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం రూ.2,600 కోట్లు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వం కేవలం రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చింది. పెళ్లి సమయంలో అందాల్సిన ఆర్థిక సాయం.. పిల్లలు పుట్టిన తర్వాత అందుతోంది. కల్యాణలక్ష్మి ఇప్పుడు సంతానలక్ష్మిగా మారిపోయింది. తప్పులు పాలకులు చేస్తూ అధికారులపై నెపం నెట్టడం సరికాదు.”
హరీశ్ రావు

ప్రభుత్వం వెంటనే 22A నిషేధిత భూముల జాబితాను బేషరతుగా రద్దు చేసి ప్రజలకు మానసిక ప్రశాంతత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *