Fake Currency

Fake Currency: సోషల్ మీడియా మంచికంటే ఎక్కువగా చెడునే నేర్పిస్తుంది..

Fake Currency: సోషల్ మీడియా మంచి కోసం వాడితే ఎంత ఉపయోగమో.. చెడు మార్గంలోకి వెళ్తే అంతే ప్రమాదకరమని నిరూపించే షాకింగ్ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వెలుగుచూసింది. తక్కువ సంపాదనతో అప్పులపాలైన ఓ కూరగాయల వ్యాపారి.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూసి, టెలిగ్రామ్ ద్వారా పక్కాగా ట్రైనింగ్ తీసుకుని సొంత ఇంట్లోనే కలర్ జిరాక్స్ మిషన్లతో నకిలీ నోట్లు ప్రింట్ చేయడం మొదలుపెట్టాడు. సమాచారం అందుకున్న రాజ్‌కోట్ సిటీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) పోలీసులు మెరుపు దాడి చేసి నిందితుడి ఆటకట్టించారు.

రీల్ చూసి టెలిగ్రామ్‌లో క్లాసులు.. రూట్‌ మార్చిన వైనం..

పోలీసుల విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు విని అధికారులే ముక్కున వేలేసుకున్నారు. రాజ్‌కోట్‌లోని మాందడుంగర్ ప్రాంతానికి చెందిన కిషన్ సోలంకి రోజూ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అయితే ఆ వచ్చే ఆదాయం సరిపోకపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో షార్ట్‌కట్‌లో డబ్బు సంపాదించాలని అనుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో మొదలు..
ఖాళీ సమయంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండగా.. 100, 500 రూపాయల నకిలీ నోట్లను ఎలా తయారు చేయవచ్చో వివరిస్తున్న ఓ రీల్ అతడి కంటపడింది. వెంటనే ఆ అకౌంట్ వెనుక ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని సంప్రదించాడు. ఆ తర్వాత వీరిద్దరూ టెలిగ్రామ్‌‌లోకి మారిపోయారు. చాటింగ్ ద్వారా ఎలాంటి బటర్ పేపర్ వాడాలి, ఏ ప్రింటర్లను ఉపయోగించాలి, వాటర్‌మార్క్, థ్రెడ్ లామినేషన్ ఎలా చేయాలనే ప్రాసెస్ మొత్తాన్ని కిషన్ నేర్చుకున్నాడు. తాను ప్రింట్ చేసిన రూ.10,000 విలువైన నకిలీ నోట్లను ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తికి పంపగా.. అతడు రూ.3,000 అసలైన నోట్లను చెల్లించినట్లు కిషన్ తెలిపాడు. ఇప్పుడు ఆ టెలిగ్రామ్ ట్రైనర్ ఎవరా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
ఇంట్లోనే మినీ ప్రింటింగ్ ప్రెస్ – దొరికిన సామగ్రి..
ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు కిషన్ సోలంకి ఇంటిపై దాడి చేసి, అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో 216 వంద రూపాయల నకిలీ నోట్లు, 3 ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు దొరికాయి.ఒక సీపీయూ, కంప్యూటర్ మానిటర్, రెండు అత్యాధునిక ప్రింటర్లు, లామినేటర్-హీటర్ మెషిన్, ప్రత్యేకమైన బటర్ పేపర్లు, వంద రూపాయల నోట్ల ప్రింట్లు ఉన్న కాగితాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ సామగ్రి విలువ సుమారు రూ.65,500 ఉంటుందని రాజ్‌కోట్ డీసీపీ (క్రైమ్) జగదీష్ బంగర్వా వెల్లడించారు.
జాతరల్లో సైలెంట్‌గా చలామణి – 3 రోజుల కస్టడీ..
నిందితుడు నకిలీ నోట్లను ఎవరికీ బల్క్‌గా అమ్మకుండా, చాలా చాకచక్యంగా తానే స్వయంగా మార్కెట్‌లో చలామణి చేసినట్లు తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చిన్న చిన్న షాపుల్లో సరుకులు కొంటూ సుమారు 40 నకిలీ వంద రూపాయల నోట్లను మార్కెట్‌లోకి వదిలాడు. 500 నోట్లతో పోలిస్తే వంద నోటును ఎవరూ పెద్దగా పరిశీలించరనే ఉద్దేశంతోనే ఈ ట్రిక్ ప్లే చేశాడు.ఇటీవల జరిగిన ప్రసిద్ధ జన్మాష్టమి జాతర రద్దీని అడ్డం పెట్టుకుని చిన్న చిన్న కొనుగోళ్లు చేస్తూ పెద్ద ఎత్తున ఈ ఫేక్ నోట్లను చలామణి చేసినట్లు ఒప్పుకున్నాడు.

కోర్టు నిందితుడికి 3 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ సమయంలో కిషన్ ఇప్పటివరకు మొత్తం ఎన్ని నకిలీ నోట్లను ముద్రించాడు, మార్కెట్‌లో ఇంకెక్కడెక్కడ వదిలాడు, అతని వెనుక ఇంకా ఎవరైనా పెద్ద ముఠా ఉందా అనే వివరాలను రాబట్టేందుకు పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *