Chandrababu: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు నేరుగా పేదల గుమ్మాలకే చేరుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా ఇది 28వ సారి పింఛన్ల పంపిణీ అని సీఎం పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా తీరుపై తనదైన శైలిలో చురకలంటించారు.
సీఎం అంటే కామన్ మ్యాన్.. బటన్లు నొక్కే వ్యక్తిని కాదు..
“నేను కూడా తాడేపల్లి ప్యాలెస్‌లా ఏసీ గదుల్లో కూర్చొని కంప్యూటర్ బటన్లు నొక్కొచ్చు. కానీ అది నా విధానం కాదు. ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకోవడానికే నేరుగా మీ గడప వద్దకు వచ్చాను. నా దృష్టిలో సీఎం అంటే ‘కామన్ మ్యాన్’. పేదలకు సేవ చేయడమే నా జీవిత పరమావధి. అందుకే ప్రతి నెలా కనీసం నాలుగు సార్లు ప్రజల మధ్యకు వస్తున్నాను” అని తెలిపారు.
తాము ప్రజలపై పెత్తనం చెలాయించడానికి రాలేదని, ప్రజలకు సేవకులుగా ఉండేందుకే పనిచేస్తున్నామని అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడించారు.
ప్రజలు బుద్ధి చెబితే.. అలిగి అసెంబ్లీకి రావడం లేదు..
వైఎస్ జగన్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమిని మనస్ఫూర్తిగా నమ్మి 54 శాతం ఓట్లు, ఏకంగా 94 శాతం సీట్లు కట్టబెట్టారని గుర్తు చేశారు. “మీరు ఇచ్చిన చారిత్రక తీర్పుతో రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయింది. ప్రజలు తమను చిత్తుగా ఓడించారనే కోపంతో, ప్రజాతీర్పుపై అలిగి జగన్ అసెంబ్లీకి రావడం మానేశారు. సభకు రాని ప్రతిపక్షాన్ని మేం అస్సలు పట్టించుకోం.. మాకు ప్రజల సంక్షేమమే ముఖ్యం” అని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ప్రతిపక్షం గ్రాఫ్ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోందని, కూటమి ప్రభుత్వ గ్రాఫ్ మాత్రం ప్రజల మద్దతుతో మరింతగా పెరుగుతోందని ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో సైతం తేలిందని చంద్రబాబు చెప్పారు.
వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడాం – రూ.76 వేల కోట్ల పింఛన్లు..
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసి, వ్యవస్థలను విధ్వంసం చేశారని సీఎం ఆరోపించారు. “రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి ఓటేసి గెలిపించారు. గత పాలకులు ఇష్టానుసారంగా చేసిన అప్పుల భారాన్ని మోస్తూనే, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఖజానా పరిస్థితి మెరుగుపడుతోంది” అని వివరించారు.
రూ.76 వేల కోట్లు నేరుగా ప్రజలకే
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం సామాజిక భద్రతా పింఛన్ల రూపంలోనే పేదలకు ఏకంగా రూ.76,000 కోట్లను అందజేశామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు గౌరవంగా జీవించేలా నెలనెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
