AP news: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ అభివృద్ధి కోసం ఒక చారిత్రాత్మక ముందడుగు వేయబడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం మూడు నెలల కాలంలో 12,500 గోకులాల నిర్మాణం పూర్తి చేయడం విశేషం.
గోకులాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలు, చిన్న మరియు మధ్యస్థాయి పాడి రైతులకు ఆర్థిక వనరులను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇవి పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడుతూ, అధిక పాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడిన గోకులాలు పాడి పశువుల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతున్నాయి.
పాడి పశువుల ఆరోగ్యం బాగా ఉండడం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది. గోకులాల ద్వారా ప్రతి పాడి పశువునుంచి రోజుకు రెండు లీటర్ల అదనపు పాల ఉత్పత్తి సాధ్యమవుతోంది. ఈ ఉత్పత్తి ద్వారా రైతు నెలకు రూ.12,000 అదనపు ఆదాయం పొందుతున్నాడు.
గత పాలనతో పోలిస్తే ఈ పథకం పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. గత ఐదేళ్లలో కేవలం 268 గోకులాలు మాత్రమే నిర్మించబడ్డాయి. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మూడు నెలల్లోనే 12,500 గోకులాలను నిర్మించి రైతులకు అందించడం ఒక గొప్ప మైలురాయి.
ఈ పథకం పాడి రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార భద్రతను పెంపొందించడానికి దోహదపడుతోంది. ఇది గ్రామీణ అభివృద్ధి దిశగా అమలు చేయబడిన ఒక వినూత్న పథకంగా నిలిచింది.