Gachibowli 

Gachibowli: క్యాబ్ ఎక్కుతుండగా మహిళా టెక్కీకి బలవంతంగా ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు..

Gachibowli: హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో పట్టపగలు అత్యంత వికృతమైన, కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఆఫీసుకు వెళ్లేందుకు రోడ్డుపై క్యాబ్ ఎక్కుతున్న ఓ యువ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పక్కకు లాగి ఓ సెక్యూరిటీ గార్డు బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగిన ఈ దారుణ చర్యతో సదరు టెక్కీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి కటకటాల వెనక్కి నెట్టారు.

క్యాబ్ ఎక్కుతుండగానే ఘాతుకం..

వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తూ, ఇందిరానగర్‌లోని ఓ పీజీ (PG) హాస్టల్‌లో ఉంటోంది.సెప్టెంబర్ 23 ఉదయం విధుల నిమిత్తం ఆఫీసుకు వెళ్లేందుకు ఇందిరానగర్ ప్రధాన రోడ్డుపై క్యాబ్ బుక్ చేసుకుని వేచి చూస్తోంది. క్యాబ్ రాగానే డోర్ తెరిచి కారు ఎక్కుతుండగా, సమీపంలో ఉన్న సెక్యూరిటీ గార్డు ఒక్కసారిగా ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దుపెట్టాడు.ఈ ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల జనం అప్రమత్తం కావడంతో భయపడిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

సీసీటీవీల ఆధారంగా నిందితుడి అరెస్ట్..

ఘటనతో షాకైనప్పటికీ ధైర్యం చేసి సదరు యువతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల రాజ్‌కుమార్‌గా గుర్తించారు.ఇందిరానగర్‌లోని ‘సంతోష్ దాబా’లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ను పోలీసులు గాలించి పట్టుకుని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు.

నిత్యం వేలాది మంది ఉద్యోగులతో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో పట్టపగలే ఇలాంటి ఘటన జరగడం స్థానిక టెక్కీలలో, పీజీలలో ఉండే మహిళల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మహిళల భద్రత విషయంలో రాజీలేకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *