Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మృతి పట్ల కూటమి ప్రభుత్వం గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుంది. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూసిన ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రజా నాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన ఆళ్ల నాని మరణం పట్ల రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విదేశాల నుంచి రానున్న కుమారులు..
ఆళ్ల నానికి ఇద్దరు కుమారులు ఉండగా, వారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారు బుధవారం రాత్రికి ఏపీకి చేరుకోనున్నారు. వారి రాక అనంతరం, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు గురువారం ఏలూరు నగరంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
మంత్రి నారా లోకేశ్ హాజరు..
గురువారం ఏలూరులో జరగనున్న ఆళ్ల నాని అంత్యక్రియల్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా పాల్గొని నివాళులర్పించనున్నారు.
భారీ బందోబస్తు ఏర్పాట్లు..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ఆయనకు అశేష అభిమాన గణం ఉండటంతో పాటు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. దీంతో ఏలూరు నగరంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వ లాంఛనాల నిర్వహణకు ఏర్పాట్లను వేగవంతం చేసింది.
వివాదరహితుడు – ప్రజానాయకుడు..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆళ్ల నాని.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వైద్యారోగ్య రంగాన్ని సమర్థవంతంగా నడిపించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు.
టీడీపీలో చేరిక..
2024 సాధారణ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎల్లప్పుడూ సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతగా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
